Begin typing your search above and press return to search.

370 ఆర్టిక‌ల్ ర‌ద్దుపై తెర‌వెనుక ఇంత జ‌రిగిందా!?

By:  Tupaki Desk   |   13 Feb 2023 5:06 PM
370 ఆర్టిక‌ల్ ర‌ద్దుపై తెర‌వెనుక ఇంత జ‌రిగిందా!?
X
భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 370కి చాలా ప్రాధాన్యం ఉంది. జ‌మ్ము క‌శ్మీర్‌కు స్వ‌యంప్ర‌తిప‌త్తి (అటాన మ‌స్‌)ని క‌ల్పించే ఈ ఆర్టిక‌ల్ ద్వారానే జ‌మ్ము క‌శ్మీర్‌.. దాదాపు 70 సంవ‌త్స‌రాలుగా త‌న పాల‌న‌ను తాను చేసుకుంటోంది. అయితే.. ఈ ఆర్టిక‌ల్ కార‌ణంగానే పాకిస్థాన్ దూకుడును నిలువ‌రించ‌లేక పోతున్నామ న్న వాద‌న కూడా ఉంది. అంతేకాదు.. దేశంలోనే భాగ‌మైన క‌శ్మీర్‌.. ఈ ఆర్టిక‌ల్ కార‌ణంగా.. ప్ర‌త్యేక అధికారాల‌ను కూడా పొందింది. దీనిపైనా గ‌తంలో విమ‌ర్శ‌లు వున్నాయి.

ఇక‌, ఆర్ ఎస్ ఎస్‌స‌హా.. బీజేపీలు ఈ ఆర్టిక‌ల్ ను ఎంత‌గానో వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ.. తొలి బాణం ఈ ఆర్టిక‌ల్‌పైనే గురి పెట్టారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేస్తామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు. కానీ, చేసేశారు. ఇది.. చాలా సున్నిత‌మైన వివాదాస్ప‌ద మైన‌.. అత్యంత విమ‌ర్శ‌నాత్మ‌క‌మైన నిర్ణ‌య‌మనే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ.. మోడీ వెనుక‌డుగు వేయ‌లేదు. దీని వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను రంగంలోకి దింపి.. కావ‌ల‌సిన కార్యాన్ని న‌డిపించారు.

అయితే..అప్ప‌ట్లో షా ఎంత క‌ష్ట‌ప‌డ్డారు..? ఏం చేశారు? అనేది ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు. ఇప్పుడు ఆయా విశేషాల‌ను రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్ కె.జె.ఎస్‌.ధిల్లాన్ బ‌య‌టి ప్ర‌పంచానికి వెల్ల‌డించారు. తాజాగా ఆయ‌న రాసిన ''కిత్నే గాజీ ఆయే..కిత్నే గాజీ గయే''(ఎంతో మంది వ‌చ్చారు-ఎంతో మంది వెళ్లారు) పుస్త‌కంలో అప్ప‌టి సంగ‌తుల‌ను కూలంక‌షంగా వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం ఈ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. ఈ నేప‌థ్యంలో ఈ పుస్త‌కంలోకి కీల‌క విష‌యాల‌ను ఆయ‌న పంచుకున్నారు.

జ‌మ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణం 370 రద్దు వెనుక 2019 జూన్‌లో శ్రీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జరిపిన పర్యటన కీలకపాత్ర పోషించిందని రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్ కె.జె.ఎస్‌.ధిల్లాన్‌ తెలిపారు. ఈ అధికరణం రద్దు అయితే తలెత్తే పరిణామాలపై హోంమంత్రి ముందస్తుగానే భారీ కసరత్తు చేశారని పేర్కొన్నారు.

''2019, జూన్‌ 26న అమిత్‌ షా శ్రీనగర్‌ వచ్చారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆయన పేషీ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ఉదయం 7 గంటలకు కలవమని. సమావేశంలో చాలా సున్నితమైన అంశాలు చర్చకు వచ్చాయి. 370 రద్దు చేస్తే, పాక్‌ స్పందనెలా ఉంటుందన్న అంశంపైనా చర్చించాం`` అని ధిల్లాన్ వెల్ల‌డించారు.

సమావేశం ఎజెండాపైనా, విషయంపైనా హోంమంత్రి పూర్తి స్పష్టతతో ఉన్నారని తెలిపారు. బహుశా ఆయన విపరీతమైన పరిశోధన, కసరత్తు చేసి ఉంటారని చెప్పారు. అయితే.. త‌న అభిప్రాయాన్నీ అడిగారని, రిత్ర రాయాలంటే.. ఎవరో ఒకరు చరిత్ర సృష్టించాలని చెప్పానన‌న్నారు. 370 రద్దుకు ముందు శ్రీనగర్‌లో జరిగిన ఆఖరి సమావేశం అదేనని, తర్వాత 2019 ఆగస్టు 5న అధికరణం రద్దు అయిందని పేర్కొన్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.