Begin typing your search above and press return to search.

నెత్తిన సుడి ఉండటం అంటే ఇదే గురూ!

By:  Tupaki Desk   |   7 April 2023 7:00 AM GMT
నెత్తిన సుడి ఉండటం అంటే ఇదే గురూ!
X
నెత్తిన సుడి ఉంటే అన్నీ సవ్యంగా సాగుతాయని సామెత. జరగనవి, తప్పిపోవాల్సిన మంచి కూడా జరుగుతుందంటారు. ఇప్పుడు అచ్చం ఇలాగే కర్ణాటకలో ఒక వ్యక్తి నెత్తిన సుడి ఉండటంతో తప్పిపోవాల్సిన రూ.44 కోట్ల లాటరీని ఒడిసిపట్టుకున్నాడు. లేదంటే అతడు చేసిన పొరపాటుకు కొంచెంలో కోట్ల రూపాయలను పోగొట్టుకునేవాడు.

ఈ వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన అరుణ్‌ కుమార్‌ వటక్కే ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు లాటరీల పిచ్చి ఉంది. దీంతో ఆన్‌ లైనులో విదేశీ లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తూ వస్తున్నాడు. ఇలాగే గత నెలలో రూ.250 పెట్టి దుబాయ్‌ కు చెందిన ఒక లాటరీ టికెట్‌ కొన్నాడు. ఎప్పటిలాగే కొన్నాడు తప్ప లాటరీ వస్తుందని అతడు కలలో కూడా అనుకోలేదు.

కానీ, అనూహ్యంగా అతడు లాటరీ గెలిచాడు. ఏకంగా 20 మిలియన్‌ దిర్హామ్‌ లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో అక్షరాలా ఈ మొత్తం 44 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఇందుకు సంబంధించి ఏప్రిల్‌ 3వ తేదీన అరుణ్‌ కుమార్‌ లాటరీ గెలిచినట్టు లైవ్‌ షో ద్వారా ప్రకటించారు.

దీంతో లాటరీ గెలుచుకున్నట్టు ఆయనకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. అయితే అరుణ్‌ కుమార్‌ దాన్ని ప్రాంక్‌ కాల్‌ అనుకున్నాడు. అంతేకాకుండా ఆ నంబరును అరుణ్‌ బ్లాక్‌ చేశాడు. అయితే పట్టు వదలని లాటరీ నిర్వాహకులు మరో నంబర్‌ ద్వారా అరుణ్‌ కు కాల్‌ చేశారు. అప్పుడు కాని అరుణ్‌ ఈ విషయాన్ని నమ్మలేదు.

లాటరీ నిర్వాహకుల నుంచి తనకు కాల్‌ వచ్చినప్పుడు మొదట తాను అది ఫేక్‌ కాల్‌ అనుకున్నానని అరుణ్‌ వెల్లడించాడు. ఎవరైనా ప్రాంక్‌ కాల్‌ చేసి ఏడిపిస్తున్నారని భావించానన్నాడు. దీంతో తాను ఆ కాల్‌ డిస్‌ కనెక్ట్‌ చేసి ఆ నంబర్‌ ను బ్లాక్‌ చేశానని.. ఇంతలో తనకు మరో ఫోన్‌ నుంచి కాల్‌ వచ్చిందని వివరించాడు.

కాగా అరుణ్‌ గెలుచుకున్న మొత్తంలో పన్నులు కిందే 50 శాతం పోతాయని తెలుస్తోంది. దీంతో ఆయన గెలుచుకున్న రూ.44 కోట్లలో పన్నులు కింద సగం పోతే రూ.22 కోట్లు ఆయనకు అందుతాయి. ఇంత పెద్ద మొత్తం తనకు అందుతుండటంతో అరుణ్‌ ఆనందం అంతా ఇంతా కాదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.