Begin typing your search above and press return to search.

డిప్యూటీ సీఎం బూడికి బిగ్ షాక్.. సైకిలెక్కనున్న కొడుకు...?

By:  Tupaki Desk   |   4 July 2023 5:00 PM GMT
డిప్యూటీ సీఎం బూడికి బిగ్ షాక్.. సైకిలెక్కనున్న కొడుకు...?
X
వైసీపీ లో ఆయన కీలక నేత. ఉప ముఖ్యమంత్రి కూడా. ఆయనే ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగుల నుంచి రెండు సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బూడి ముత్యాలనాయుడు ఇంట్లోనే ఇపుడు చిచ్చు రేగింది. ఆయన సొంత కుమారుడే ఫ్యాన్ నీడన ఉక్క బోతగా ఉందని సైకిలెక్కేయాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బూడి ముత్యాలనాయుడు మాడుగులను వైసీపీకి కంచుకోటగా చేశారు.

ఆరు సార్లు టీడీపీ గెలిచిన సీట్లో 2014 నుంచి పాగా వేసి 2024లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. నిజానికి మాడుగులలో బూడికి ఆల్టర్నేషన్ కూడా టీడీపీలో లేరు. ఇతర ప్రాంతాల నుంచి నాయకులు వచ్చి పోటీ పడాలని చూస్తున్నరు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు ఇపుడు పెద్దగా పరపతి లేదు అంటున్నారు. ఆయన్ని తప్పించి ఇంచార్జిగా కుమార్ అనే నాయకుడిని చంద్రబాబు పెట్టినా మాడుగులలో సైకిల్ స్పీడ్ లేదు.

ఇక బూడి అయింతే మాడుగులనే అంటిపెట్టుకుని విగరస్ గా జనంలో తిరుగుతున్నారు. ఆయనకు పోటీ లేకపోవడంతో కచ్చితంగా వైసీపీ గెలిచే సీట్లలో దాన్ని వేసుకుంటున్నారు. అలాంటి బూడి ఫ్యామిలీ నుంచి ఆయన కొడుకు బూడి రవి వెళ్ళి చంద్రబాబుని కలవడం అంటే ఆశ్చర్యంగానే అంతా చూస్తున్నరు. గత నెలలో చంద్రబాబు ఎస్ కోట టూర్ చేశారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా నాయకురాలు కోళ్ళ లలితకుమారి ఇంట్లో బూడి రవి చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు అని అంటున్నారు.

ఇది జరిగి నెల రోజులు అయినా ఎక్కడా బయటకు పొక్కలేదు. కానీ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో చంద్రబాబు తో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుఇ కొడుకు ఫోటోలు చూసిన వారు అంతా ఖంగు తింటున్నారు. బూడి రవి సైకిలెక్కుతున్నారు అన్న ప్రచారం మొదలైంది. బూడి వైసీపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉండగా కొడుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఏంటి అంటే ఆయన ఇంట్లోనే గొడవల వల్ల ఇలా జరుగుతోంది అని అంటున్నారు.

బూడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కొడుకే బూడి రవి. ఆయనకు రాజకీయ ఆసక్తి ఉంది. రెండేళ్ళ క్రితం జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో రవి కె కోటపాడు నుంచి జెడ్పీటీసీగా వైసీపీ తరఫున నామినేషన్ వేశారు. కానీ బూడి జోక్యంతో చివరి నిముషంలో ఆయన తన నామినేషన్ని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. ఆ ప్లేస్ లో బూడి రెండ్వ భార్య కుమార్తె బూడి అనూరాధని నిలబెట్టి బూడి దగ్గరుండి మరీ గెలిపించారు అని అంటున్నారు.

అంతే కాదు ఆమె అనకాపల్లి జిల్లా వైసీపీ మహీళా విభాగం అధ్యక్షురాలిగా పార్టీ పదవిలో కొనసాగుతున్నారు. ఆమె మంచి మాటకారి, బూడికి వారసురాలు అని అంతా అంటూంటారు. అయితే బూడి మొదటి భార్య కొడుకు ఉన్న సంగతి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇపుడు రవి తెర ముందుకు రావడంతో బూడి ఇంట్లోనే రాజకీయ చిచ్చు మొదలైంది అని అంటున్నారు.

ఇక అనూరాధ మొదటి నుంచి తండ్రికి చేదోదు వాదోడుగా ఉంటూ ఆయన తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ మధ్యన అయితే బూడి ఈసారికి రిటైర్ అయి తన కూతురుకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరినట్లుగా ప్రచారం సాగింది. అయితే ఇపుడు హఠాత్తుగా రవి బయటకు రావడంతో టీడీపీ ఆయనకు మాడుగుల టికెట్ ఇచ్చి తండ్రికి పోటీగా రంగంలోకి దింపుతుందా అన్న చర్చ కూడా వస్తోంది.

ఇదిలా ఉంటే బూడి ఇంట్లో చిచ్చు రేగడం పట్ల వైసీపీ హై కమాండ్ ఎలా ఆలోచిస్తుందో చూడాల్సి ఉంది. ఈసారి కచ్చితంగా గెలిచే సీటుగా ఇప్పటిదాక మాడుగులను తమ ఖాతాలో వేసుకున్న వైసీఈకి బూడి ఫ్యామిలీలోనే విభేదాలు కొడుకే సైకిలెక్కేస్తారు అంటే మాత్రం అంతకు మించిన బిగ్ షాక్ వేరొకటి ఉండబోదు అని అంటున్నారు. చూడాలి మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న బూడి ఈ వివాదాన్ని ఎలా సెట్ చేసుకుంటారో. సెట్ చేసుకోకపోతే మాత్రం మాడుగుల హల్వా కాస్తా టీడీపీ నోట్లోకి వెళ్ళిపోతుంది అని అంటున్నారు.