Begin typing your search above and press return to search.

వైరల్ ఆడియో.. పోలీసులకు గులాబీ ఎమ్మెల్యే వార్నింగ్?

By:  Tupaki Desk   |   22 April 2020 4:00 AM GMT
వైరల్ ఆడియో.. పోలీసులకు గులాబీ ఎమ్మెల్యే వార్నింగ్?
X
కరోనా వేళ.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్పే ఆడియో టేపు ఒకటి హల్ చల్ చేస్తోంది. సదరు టేపులో పోలీసులకు ఎమ్మెల్యే హెచ్చరికలు చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అతడిదిగా చెబుతున్న ఆడియో టేపులో ఏముందన్న విషయంలోకి వెళితే..

లాక్ డౌన్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించేలా చేసే విషయంలో తెలంగాణ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని.. ఈ సందర్భంలో హద్దులు దాటిన వారిని కట్టడి చేసే విషయంలో వినూత్నంగా వ్యవహరిస్తున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటివేళ.. బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ మాత్రం పోలీసుల తీరుపై గరంగరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే ఆయన పోలీసులతో మాట్లాడినట్లుగా చెప్పే ఆడియో టేపు ఒకటి బయటకు వచ్చింది.

అందులో బోధన్ ఏసీపీ జైపాల్ రెడ్డి.. టౌన్ సీఐ రాకేష్ గౌడ్ తో సమా ఎస్ఐల తీరుపై ఫైర్ అయ్యారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఒక వర్గం వారే ఉల్లంఘిస్తున్నట్లుగా పోలీసులు టార్గెట్ చేసి కొడుతున్నట్లుగా సదరు ఆడియోలో ఆయన ఆరోపించటం గమనార్హం. ఈ విషయంపై సీపీతో పాటు ఉన్నతాధికారులందరికి తాను కంప్లైంట్ చేశానని.. అయినప్పటికీ అధికారుల తీరు మారటం లేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇలానే వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆడియో టేపును గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. ఈ సంభాషణ టేపు వైరల్ గా మారింది. ఇందులోని మాటలన్ని బోధన్ ఎమ్మెల్యేవేనా? కాదా? అన్నది కన్ఫర్మ్ కావాల్సి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్న వేళ.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ తరహాలో వ్యాఖ్యలు చేయటమా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. ఈ ఆడియో లెక్క తేలాలంటే బోధన్ ఎమ్మెల్యే క్లారిటీ ఇస్తే బాగుంటుందంటున్నారు.