Begin typing your search above and press return to search.

సిల్క్ స్మిత వచ్చినా జనం వస్తారు.. పవన్ పై బొత్స పంచ్ లు

By:  Tupaki Desk   |   16 Jun 2023 2:49 PM IST
సిల్క్ స్మిత వచ్చినా జనం వస్తారు.. పవన్ పై బొత్స పంచ్ లు
X
రాజకీయాలన్న తర్వాత విమర్శలు.. ప్రతివిమర్శలు మామూలే. రాజకీయ ప్రత్యర్థిపై విరుచుకుపడే వేళలోనూ పద్దతిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయితే..ఆ విషయంలో ఏపీ అధికారపక్ష నేతలు కట్టు తప్పేస్తుంటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో పేర్ని నాని.. అంబటిరాంబాబు లాంటివాళ్లు ఇలాంటి తప్పులే చేస్తుంటారు. విమర్శలు సహేతుకంగా ఉన్నప్పుడు ప్రజలు సైతం.. ఆ విమర్శల్ని సీరియస్ గా తీసుకుంటారు. అందుకు భిన్నంగా యూట్యూబ్ లోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యేందుకు వీలుగా మాట్లాడితే.. దాని వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది.

సీనియర్ నేతగా.. అనుభవం ఉన్న పేర్ని నాని పవన్ అన్నంతనే ఒకలాంటి ఫస్ట్రేషన్ కు గురై.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ.. అడ్డంగా బుక్ కావటమే కాదు.. పార్టీని సైతం బుక్ చేస్తున్నారు. ఇలాంటి వేళలో.. వైసీపీ మంత్రి బొత్స సత్యానారాయణ తాజాగా స్పందించిన తీరు చూసినప్పుడు.. పవన్ ను విమర్శించాలంటే ఈ మాత్రం పద్దతి అవసరమన్న భావన కలుగక మానదు.

పవన్ సభలకు..కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వస్తున్న జనసందోహంపైనా పంచ్ లు వేశారు బొత్స. 'ఒక కమెడియన్ అయిన యాక్టర్ వచ్చినా జనాలు వస్తారు. ఒక వ్యాంప్ క్యారెక్టర్ వేసే.. పాపం చనిపోయిన సిల్క్ స్మిత వచ్చినా చూడటానికి జనాలు వస్తారు'' అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదని.. ప్రభుత్వం తరఫున ఏదైనా తప్పు జరిగితే.. ఇదిగో ఇక్కడ ఇలా తప్పు జరిగిందని ఆధారాలతో చూపించాలన్నారు.

''ప్రజాసొమ్ము దుర్వినియోగం అవుతుందని చెప్పు. నీ సహచరుడు.. స్నేహితుడు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏదైనా మంచి పని జరిగి ఉంటే.. పోల్చి చేసి చూపించు. బాగుంటుంది. రాష్ట్రంలో రెండు అతి పెద్ద లేఔట్లలో ఒకటి విజయనగరం లేఔట్లు. 400 ఎకరాల్లో 12వేల మందికి అక్కడ నివాసం కోసం లేఔట్లు వేసి.. సుమారు 10వేల మందికి ఇళ్లను శాంక్షన్ చేస్తున్నాం. అవి వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒక్క తప్పు జరిగిందో చూపించండి'' అంటూ ప్రశ్నించారు.

ఓవైపు ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే.. ఎక్కడా అనవసరమైన మాటలు మాట్లాడిన బొత్స స్పందన బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ పవన్ వారాహి విజయయాత్ర.. ఆ సందర్భంగా ఆయన చేస్తున్న విమర్శలపై సెటిల్డ్ గా స్పందించారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై హైప్ అవసరమన్న ఆయన.. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శించి.. ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్న బొత్స.. 'అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారు అన్ని గమనిస్తుంటారు' అని పేర్కొన్నారు.

ఏపీకి ముఖ్యమంత్రిగా డాన్సులు వేసుకునే వ్యక్తి మనకు అవసరమా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బొత్స.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. 'రక్తపు మరకలు అంటిన ముఖ్యమంత్రి మనకు కావాలా? అని పవన్ ఎలా మాట్లాడతారు. ఇది పద్దతి కాదు. సచివాలయాల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే గుండు కొట్టించుకుంటా. నారా లోకేశ్ ఒక పొలిటికల్ లీడర్. పవన్ కల్యాణ్ ఒక సెలబ్రిటీ. వాళ్లేమీ మునులు కాదు'' అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ తిరిగితే తమకేమీ కాదని.. ఆయన యాత్ర ప్రారంభించి 24 గంటలు దాటిందని.. ఏమైనా ఆటంకాలు ఎదురయ్యాయా? అని ప్రశ్నించారు.

తమకు తాము రాజకీయ లబ్థి కోసం ఏదేదో క్రియేట్ చేసుకోవటం సరికాదన్న బొత్స.. రక్తపు మరకలు ఎవరికి అంటాయి?అని ప్రశ్నించారు. ఈ తరహా మాటలు మాట్లాడటం సరికాదన్నారు. తైతక్కలాడే పవన్ మనకు అవసరమా? అని తాము కూడా అనగలమన్నారు. మొత్తంగా విషయం చెబుతూనే.. పవన్ ను పద్దతిగా విమర్శించిన బొత్స వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.