Begin typing your search above and press return to search.

ఆనకట్ట కొట్టుకు పోయింది..ఎక్కడో కాదు తెలంగాణలోనే..

By:  Tupaki Desk   |   1 Jan 2020 4:52 AM GMT
ఆనకట్ట కొట్టుకు పోయింది..ఎక్కడో కాదు తెలంగాణలోనే..
X
ఇరిగేషన్ అద్భుతంగా చెప్పే సరళాసాగర్ ప్రాజెక్టు నిర్లక్ష్యం గండి పడి తాజాగా కొట్టుకుపోయింది. ఆనకట్టకు పడిన గండిని సకాలంలో రిపేర్లు చేయని కారణంగా ఒక్కసారిగా ఆనకట్ట కొట్టుకుపోవటమే కాదు.. అందులో ఉన్న 0.4 టీఎంసీల నీరు సమీపంలోని ఊళ్లోకి వచ్చేసిన పరిస్థితి.దాదాపు 12 గ్రామాల ప్రజలకు ఆధారమైన ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

దాదాపు అరవై ఏళ్ల క్రితం నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మాణమే ఒక అద్భుతంగా చెబుతారు. ఆటో సైఫన్ సిస్టంతో పని చేసే ఈ ప్రాజెక్టు ద్వారా నాలుగు వేల ఎకరాలకు నీళ్లు అందుతాయి. ఇంతకీ ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది చూస్తే.. అధికారుల అలక్ష్యమేనని చెప్పాలి.

ఎందుకంటే.. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఊకచెట్టు వాగులోకి చేరింది. ఈ నీటిని సరళా సాగర్ జలాశయంలోకి వచ్చింది. నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. నీటి స్థాయి పెరుగుతున్న కొద్దీ గాలి పీడనంతో గేట్లు వాటంతట అవే తెరుచుకునే విధానం పని చేయలేదు.

దీనికి కారణం గడిచిన కొన్నేళ్లుగా రిపేర్లు చేయకపోవటమే. దీనికి తోడు పందికొక్కులు పెట్టిన గండి అంతకంతకూ ఎక్కువై.. చివరకు ఆనకట్ట తెగిపోయింది. దీంతో.. ప్రాజెక్టులో ఉన్న నీరంతా బయటకు పోయిన పరిస్థితి. ఈ కారణంగా ప్రాజెక్టు సమీపంలోని గ్రామాల్లోకి నీళ్లు వెళ్లటంతో అక్కడ నివాసం ఉన్న వారంతా గ్రామాన్ని ఖాళీ చేయాల్సిన దుస్థితి. కొత్త సంవత్సరం ముందు రోజు విరుచుకుపడిన ఈ ఉదంతంతో అక్కడివారు ఆగమాగం అవుతున్నారు.

వనపర్తి చివరి సంస్థానాధీశులు రాజా రామేశ్వర్ రావు తన తల్లి సరళాదేవి పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమంటే.. ఈ తరహా టెక్నాలజీ ఉన్న ప్రాజెక్టు ఇదొక్కటే. అది కూడా ఆసియా ఖండంలోనే కావటం. 1949లో రూ.35 లక్షల ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యంతో కొట్టుకుపోయిన పరిస్థితి. అద్భుతమైన సాంకేతికతను కొత్త ప్రాజెక్టులకు తీసుకొచ్చే సర్కారు.. ఉన్న ప్రాజెక్టులను సంరక్షిస్తే మరింత బాగుంటుంది కదా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.