Begin typing your search above and press return to search.

టీడీపీలోకి రాయలసీమ పరిరక్షణ నేత!

By:  Tupaki Desk   |   3 Feb 2023 10:24 AM GMT
టీడీపీలోకి రాయలసీమ పరిరక్షణ నేత!
X
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పెట్టింది పేరు.. నందికొట్కూరు. ఈ నియోజకవర్గం నుంచి మద్దూరు సుబ్బారెడ్డి, బైరెడ్డి శేషశయనారెడ్డి వంటివారు గతంలో ఎమ్మెల్యేలుగా చేశారు. 1978, 1983, 1989ల్లో నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. శేషశయనారెడ్డి. ఆయన తదనంతరం 1994, 1999ల్లో ఆయన కుమారుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి గౌరు చరిత చేతిలో బైరెడ్డి ఓడిపోయారు. ఇక 2009లో అప్పటివరకు జనరల్‌ నియోజకవర్గంగా ఉన్న నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడుగా మారింది. దీంతో బైరెడ్డి పాణ్యం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక ఉద్యమం జరుగుతున్నప్పుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి సైతం టీడీపీ నుంచి బయటకొచ్చి రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ప్రత్యేక ఉద్యమం నడిపారు.

టీడీపీలో ఉన్నప్పుడే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీ అధిష్టానానికి చికాకులు సృష్టించేవారని టాక్‌. రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో బైరెడ్డి కూడా రాయలసీమ స్థాయిలో కీలక నేతగా ఎదగడానికి ప్రయత్నించినా ఆ ప్రణాళిక అస్సలు వర్కవుట్‌ కాలేదు. వాస్తవానికి రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి పెద్దగా కార్యక్రమాలు చేసిందీ లేదు. అడపదడపా ప్రెస్‌ మీట్లు పెట్టడం మినహాయించి.

ఆ తర్వాత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ లోకి అక్కడి నుంచి స్వల్పకాలంలోనే మళ్లీ బీజేపీలోకి వెళ్లారు. అయితే నిలకడలేనితనం వల్ల ఏ పార్టీలోనూ ఇమడలేకపోయారు. బైరెడ్డి కుమార్తె శబరి ప్రస్తుతం బీజేపీలో యువమోర్చాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆమె చురుకుగా ఉంటున్నారు.

2014లో బైరెడ్డి శబరి పాణ్యం నుంచి రాయలసీమ పరిరక్షణ సమితి గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమెకు కేవలం 5 వేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈ నేపథ్యంలో తన కుమార్తె భవిష్యత్తుపై పెద్ద ఆశలు పెట్టుకున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలోకి రావాలని భావిస్తున్నట్టు సమాచారం. టీడీపీలో చేరి తన కుమార్తెకు పాణ్యం అసెంబ్లీ లేదా నంద్యాల ఎంపీగా అవకాశం ఇప్పించుకోవాలనేది బైరెడ్డి వ్యూహమని చెబుతున్నారు.

అయితే స్థిరత్వం లేకపోవడం, వివాదస్పద వ్యాఖ్యలు చేసే బైరెడ్డి రాజశేఖరెడ్డితో తలపోటు ఎందుకని టీడీపీ అధినేత చంద్రబాబు యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే బైరెడ్డి మాత్రం రాయలసీమకు చెందిన టీడీపీ నేతల ద్వారా ఆ పార్టీలోకి వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్‌ నడుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.