Begin typing your search above and press return to search.

జీవీకే పై సీబీఐ కేసు.. ఎందుకు? అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   2 July 2020 10:01 AM IST
జీవీకే పై సీబీఐ కేసు.. ఎందుకు? అసలేం జరిగింది?
X
మరో కార్పొరేట్ సంచలనం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగ ప్రముఖులుగా చెప్పే జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ జీవీకే రెడ్డి ఆయన కుమారుడు సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేయటం కొత్త కలకలంగా మారింది. దాదాపు రూ.300 కోట్లకు పైనా ఆర్థిక మోసానికి పాల్పడినట్లుగా వారిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖ సినీ నిర్మాత కమ్ పారిశ్రామికవేత్త సుబ్బిరామిరెడ్డికి వియ్యంకుడు జీవీకే రెడ్డి. సుబ్బిరామిరెడ్డి తన కుమార్తెను సంజయ్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు.

పారిశ్రామిక రంగంతో పాటు.. సెలబ్రిటీలుగా చెలామణి అయ్యే జీవీకే రెడ్డి ఫ్యామిలీ మీద ఈ తరహా కేసు నమోదు కావటం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సీబీఐ కేసు పెట్టేంత వరకూ ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే.. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి.. నిర్వాహణ కోసం ప్రభుత్వ.. ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మియాల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

2017-18 లో తొమ్మిది కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చి దాదాపు రూ.310 కోట్లను దారి మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల భారీ మొత్తం నష్టం వాటిల్లినట్లుగా సీబీఐ ఆరోపిస్తోంది. జీవీకే గ్రూపు ప్రమోటర్లు తమ గ్రూపు కంపెనీలకు ఆర్థిక సాయం చేసేందుకు మియాల్ రిజర్వు ఫండ్ రూ.395 కోట్లను దుర్వినియోగం చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జీవీకే పెద్దాయనతో పాటు.. ఆయన కుమారుడి తో సహా పలువురి పై సీబీఐ కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు.