Begin typing your search above and press return to search.

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం... బెయిల్ ఇవ్వొద్దు !

By:  Tupaki Desk   |   26 May 2023 8:38 PM GMT
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం... బెయిల్ ఇవ్వొద్దు !
X
కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని సీబీఐ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద దాఖలు చేసిన కౌంటర్ లో స్పష్టం చేసింది. అసలు ఈ నెల 22న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కర్నూల్ కి వెళ్లామని, అక్కడ అవినాష్ అనుచరులు పెద్ద ఎత్తున ఉండడంతో శాంతిభద్రత సమస్య రావచ్చు అని ఆగిపోయినట్లుగా పేర్కొంది.

ఇదిలా ఉంటే అవినాష్ రెడ్డిని కస్టోడియన్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని సీబీఐ చెప్పడం విశేషం. అంటే అరెస్ట్ చేసి విచారణ చేస్తామని పేర్కొంది అన్న మాట. ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భారీ కుట్ర దాగుందని దాన్ని బయటకు తేవాలంటే అవినాష్ రెడ్డిని విచారించాలని పేర్కొంది.

విచారణకు అవినాష్ రెడ్డి సహకరించడంలేదని సీబీఐ ఆరోపించింది. ఈ నెల 15న ఆయనకు నోటీసులు ఇస్తే నాలుగు రోజులు సమయం కావాలని కోరారని, 19న నోటీసులు ఇస్తే తన తల్లి అనారోగ్యం వల్ల హాజరు కాలేనని చెప్పారని సీబీఐ ఆరోపించింది. తల్లి అనారోగ్యం పేరిట ఉద్దేశ్యపూర్వకంగా అవినాష్ రెడ్డి హైదరాబాద్ విడిచి వెళ్లారని కూడా సీబీఐ తన కౌంటర్ పిటిషన్ లో పేర్కొంది.

విచారణకు హాజరు కావాలని ఫోన్ లో కోరినా ఆయన రాలేదని తెలిపింది. ఇక వైఎస్ వివేకా కేసు జూన్ 30లోగా విచారణ ముగించాల్సి ఉన్నందున అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వరాదని సీబీఐ హై కోర్టుని కోరింది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో చాలా విషయాలు ఉన్నాయని అవి రాబట్టాల్సి ఉందని కూడా పేర్కొంది.

హత్య జరిగిన రోజు రాత్రి అవినాష్ రెడ్డి వాట్సప్ కాల్స్ ని 12.28 నుంచి రాత్రి 1.10 వరకూ మాట్లాడారని సీబీఐ పేర్కొంది. ఇక సీబీఐ దాఖలు చేసిన అనుబంధ కౌంటర్ లో ఈ హత్య గురించి వివేకా పీయే కృష్ణారెడ్డి చెప్పక ముందే వైఎస్ జగన్ కి తెలుసు అన్న అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. ఇది తమ దర్యాప్తులో వెల్లడి అయిందని కూడా తెలిపింది.

జగన్ కి ముందే తెలుసు అంటే అవినాష్ రెడ్డి ఆయనకు చెప్పారా లేదా అనంది కూడా విచారణ సందర్భంగా తెలుసుకోవాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. హత్య వేనక అతి పెద్ద కుట్ర ఉందని, దాన్ని చేదించేందుకే తమ ప్రయత్నం అని సీబీఐ కోర్టుకు విన్నవించుకుంది.

మొత్తం మీద చూస్తే సీబీఐ చాలా విషయాలనే అనుబంధ కౌంటర్ లో పేర్కొంది. మరి అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాదులు అయిదున్నర గంటలు వాదించారు. రేపు సీబీఐ తన వాదనను వినిపించబోతోంది. ఈ నేపధ్యంలో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ వద్దు అంటున్న సీబీఐ వాదనను కోర్టు ఎలా చూస్తుందో తెలియాలి అంటే శనివారం దాకా ఆగాల్సిందే.