Begin typing your search above and press return to search.

ఉద్యోగులను రోడ్డున నిలబెట్టారు... వైసీపీ మీద కేంద్ర మంత్రి ఫైర్

By:  Tupaki Desk   |   12 Feb 2023 11:17 PM
ఉద్యోగులను రోడ్డున నిలబెట్టారు... వైసీపీ మీద కేంద్ర మంత్రి ఫైర్
X
ఏపీకి కేంద్ర మంత్రులు వస్తూంటారు. వారు తమ సొంత పార్టీ కర్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. అదే టైం లో మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ ని బదనాం చేసేస్తున్నారు. ఈ రోజు రాయలసీమలోని కర్నూల్ జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి దెవ సింహ్ చౌహాన్ ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మీద హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

ఏపీ ప్రభుత్వం పదవతేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో పడిదని ఆయన గట్టిగానే విరుచుకుపడ్డారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, దివాళా తీసిందని ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. ప్రభుత్వం కేవలం మద్యం ద్వరా వచ్చే ఆదాయంతో పాటు ఖనిజ సంపద ద్వరా వచ్చే సొమ్ములతో నడుస్తోందని మరో కీలక కామెంట్ చేశారు.

నెల రోజుల పాటు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన నిందించారు. ఉద్యోగులను రోడ్ల మీద నిలబెడతారా అని ఆయన మండిపడ్డారు.

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ మీద కూడా ఆయన విమర్శలు గుప్పించారు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విపక్ష నేతలను భయపెడుతున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఏపీలో సుపరిపాలన రావాలీ అంటే అది బీజేపీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేయడం విశేషం.

ఆయన మాత్రమే కాదు ఏపీకి వస్తున్న కేంద్ర మంత్రులు అంతా రాష్ట్రం ఆర్ధికంగా దెబ్బ తిందనే అంటున్నారు. ఇక బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లాంటి వారు అయితే ఉద్యోగులకు జీతాలు ఎపుడిస్తారో చెప్పలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని అంటున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి గతంలో లేదని ఆయన అన్నారు.

బీజేపీ దీన్ని బట్టి ఏపీ ప్రభుత్వం మీద గట్టిగానే విమర్శలు చేయలని నిర్ణయించుకుందని అర్ధమవుతోంది. అదే టైం లో ఏపీ దివాళా తీసిందని కూడా కేంద్ర మంత్రుల నుంచి ఎంపీలు కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా అటు ప్రజలకు వైసీపీ పాలన ఫెయిల్ అని చెప్పడమే కాదు ఉద్యోగుల నుంచి సానుభూతిని పొంది తమ వైపునకు తిప్పుకోవాలన్నది ఎత్తుగడగా ఉంది.

చిత్రమేంటి అంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వని విషయం మీద టీడీపీ వంటి పార్టీల కంటే బీజేపీ మాత్రమే ఎక్కువగా గొంతు చించుకోవడం. ఏపీ అప్పుల మీద కేంద్ర పెద్దలు కూడా పార్లమెంట్ లో ప్రకటనలు చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తూంటే ఏపీ సర్కార్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత సున్నితమైన పరిస్థితి నుంచి రాజకీయంగా లాభం పొందాలన్నది కమలనాధుల ఆలోచనగా కనిపిస్తోంది.