Begin typing your search above and press return to search.

అమిత్ షాకి టెస్ట్ పెట్టిన చంద్రబాబు!

By:  Tupaki Desk   |   15 Jun 2023 7:00 AM GMT
అమిత్ షాకి టెస్ట్ పెట్టిన చంద్రబాబు!
X
చంద్రబాబా మజాకానా మరి. ఆయన రాజకీయ చాణక్యుడు. వ్యూహాలలో దిట్ట. అందుకే కేంద్ర మంత్రి అమిత్ షాకే ఆయన ఒక పెద్ద టెస్ట్ పెట్టారు. తన సొంత నియోజకవర్గం కుప్పం టూర్ కి వచ్చిన బాబు అక్కడ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఏపీలో అవినీతి ఆకాశాన్ని అంటుతోందని అన్నారు.

ఇంతటి అవినీతి చేసిన సీఎం ని ఎక్కడా చూడలేదని అన్నారు. ఏపీ సీఎం అవినీతి మీద తాను మాట్లాడడం కాదు, ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు అని చెప్పుకొచ్చారు. ఏపీలో గడచిన నాలుగేళ్ళ కాలంలో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి చెప్పడాన్ని సీరియస్ గానే తీసుకోవాలని అన్నారు.

అంతటితో ఆగని చంద్రబాబు ఏపీలో వైసీపీ నాలుగేళ్ల అవినీతి మీద అమిత్ షా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఏలుబడిలో ఏరులై పారిన అవినీతి మీద గట్టి యాక్షన్ తీసుకుంటేనే న్యాయం జరుగుతుందని అన్నారు వైసీపీ నేతలు దోచుకున్న సొమ్ముని ప్రతీ పైసా లెక్క కట్టి మరీ వెనక్కి రప్పించాల్సి ఉందని అన్నారు.

ఈ విషయంలో కేంద్రమే చొరవ తీసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చాలా తెలివిగానే ఈ డిమాండ్ చేశారని అంటున్నారు. ఇప్పటిదాకా వైసీపీతో తెర వెనక దోస్తీ చేస్తూ వచ్చిన బీజేపీ ఒక్కసారిగా టోన్ మార్చి వైసీపీ అవినీతి అంటూ గర్జించడాన్ని ఆయన అవకాశంగా తీసుకున్నారు.

నిజంగా రెండు పార్టీల మధ్య అంత గ్యాప్ ఉందా లేక ఎన్నికల సీజన్ లో ఒక రాజకీయ పార్టీగా రొటీన్ ఆరోపణలు బీజేపీ చేసిందా అన్నది తేల్చుకోవడానికే చంద్రబాబు ఈ డిమాండ్ చేశారని అంటున్నారు. అది కూడా ఆయన కేంద్ర హోం మంత్రి మాటలనే ఆసరాగా తీసుకుని విచారణకు కోరడం విశేషం.

ఇప్పటికే చాలా కాలంగా తెలుగుదేశం ఏపీ ప్రభుత్వ అవినీతి మీద విచారణ కావాలని అడుగుతోంది. ఇపుడు ఎటూ కేంద్రమే ఏపీ సర్కార్ మీద గురి పెట్టింది. దాంతో తాము కోరుకున్నదే జరగాలన్న వ్యూహంతో బీజేపీ పెద్దలనే ముందు పెట్టి బాబు ఇలా డిమాండ్ చేశారని తెలుస్తోంది.

మరి కేవలం ఆరోపణలుగా బీజేపీ నేతలు వైసీపీ మీద చేశారా లేక వారి వద్ద ఆధారాలు ఉన్నాయా అన్న చర్చ కూడా ఉంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది. ఆ పార్టీ వైసీపీ అవినీతి మీద విచారణ కోరుతోంది. బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే చేతిలో అధికారం ఉంది కాబట్టి విచారణ జరిపి నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. లేకపోతే బీజేపీ ఆరోపణలకు విలువ ఉండదు. ఇలా రెండిందాల వ్యూహంతోనే తన సొంత నియోజకవర్గం నుంచి అటు బీజేపీని ఇటు వైసీపీకి ఇరకాటం పెట్టేలా బాబు డిమాండ్ చేశారు అని అంటున్నారు.