Begin typing your search above and press return to search.

వెన్నుపోటుపై మరోసారి ఓపెన్ అయిన చంద్రబాబు.. తాజాగా ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   18 Feb 2023 11:02 AM GMT
వెన్నుపోటుపై మరోసారి ఓపెన్ అయిన చంద్రబాబు.. తాజాగా ఏం చెప్పారంటే?
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నంతనే పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచారన్న పేరు వినిపిస్తుంది. బ్యాడ్ లక్ ఏమంటే.. అప్పట్లో జరిగిన పరిణామాల్ని.. ఆ తర్వాతి కాలంలో వివరణ రూపంలో ఇచ్చి.. అప్పట్లో ఎందుకు అలా జరిగిందన్న విషయాన్ని వివరిస్తే సరిపోయేది. కానీ.. ఆ ప్రయత్నం చంద్రబాబు చేయకపోవటం.. దానికి పర్యవసానంగా ఏళ్లకు ఏళ్లుగా ఆయన మాటలు పడాల్సి వస్తోంది. కొన్ని విషయాల మీద మాట్లాడటానికి ఇష్టపడని తత్త్వం తర్వాతి రోజుల్లో అదో మచ్చగా మారటం తెలిసిందే. అదే కొన్నిసార్లు పలు ఇబ్బందులకు గురి చేస్తుంది.

తాజాగా ఒక టాక్ షోకు హాజరైన చంద్రబాబు.. వెన్నుపోటు మరక మీద సంధించిన ప్రశ్నకు స్పందించారు. అసలేం జరిగిందన్న విషయాన్ని క్లుప్తంగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటల్లోనే చెప్పాలంటే.. ''1994 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత సీనియర్లను నిర్లక్ష్యం చేయటం మొదలైంది.

కొందరికి అవమానాలు జరిగాయి. అశాంతి మొదలైంది. ఇటు ఎన్టీఆర్ కుటుంబం. అటు పార్టీ నాయకుల్లోనూ ఇదే పరిస్థితి'' అని చెప్పిన ఆయన.. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో లాభం లేదనుకొని.. నేను పెద్దాయనతో కూర్చొని మూడు గంటల పాటు చర్చించినట్లు చెప్పారు. 'మూడు గంటల చర్చల్లో వాదన జరిగింది. మా ఇద్దరితో పాటు బీవీ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు.

దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పా. కారణాలు ఏమైనా దిద్దుబాటు జరగలేదు. ఆ ఆరోజు ఆ నిర్ణయం తీసుకున్నాం కాబట్టే.. పార్టీ పటిష్ఠంగా ఉంది. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తోంది. ఆ రోజు ఆ ఘటనకు కారణమైన వ్యక్తులు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చూస్తున్నారు. వారి పేర్లు నేను చెప్పను'' అని పేర్కొన్నారు.

సదరు టాక్ షోలో చంద్రబాబు చెప్పేందుకు ఇష్టపడని ఆ పేరు లక్ష్మీ పార్వతి అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె వైసీపీలో ఉన్నారు. వైస్రాయ్ ఎపిసోడ్ జరిగిన తర్వాత.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం.. ఆ తర్వాత ఎన్టీఆర్ మరణించటం.. కొద్ది కాలం తర్వాత అన్నా తెలుగుదేశం పార్టీని లక్ష్మీ పార్వతి మొదలు పెట్టి ఆ తర్వాత మూసేయటం.. తర్వాత జగన్ పార్టీలో చేరటం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.