Begin typing your search above and press return to search.

అమిత్ షా...బాబు భేటీ సీక్రెట్...వ్యూహమా లేక...?

By:  Tupaki Desk   |   5 Jun 2023 10:51 PM GMT
అమిత్ షా...బాబు భేటీ  సీక్రెట్...వ్యూహమా లేక...?
X
మూడు రోజుల క్రితం తెలుగు రాజకీయాల్లో అతి పెద్ద రాజకీయ పరిణామమే చోటు చేసుకుంది. దాదాపు అయిదేళ్ళ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోం మంత్రి బీజేపీ పెద్ద అమిత్ షా ను కలుసుకున్నారు. ఈ భేటీ దాదాపు గా గంట పాటు జరిగింది. 2018 మార్చిలో బీజేపీతో విడిపోయాక బాబు ఆ పార్టీ పెద్దల ను ఇంతవరకూ కలసింది లేదు. భేటీలు వేసింది లేదు.

అలా కనుక చూసుకుంటే ఈ భేటీ భూమి బద్ధలు అయ్యేంత సెన్సేషన్ క్రియేట్ చేయాలి. కానీ భేటీ జరిగింది అంతే ఆ వార్తే బయట కు వచ్చింది. ఆ మీదట ఎవరి కి తోచినట్లుగా వారు ఊహాగానాలు రాసుకున్నారు. చెప్పుకున్నారు. కానీ అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ దీని మీద ఏమి జరిగింది అన్నది మ్యాటర్ అయితే బయటపెట్టలేదు.

ఈ భేటీ పోనీ అఫీషియల్ అందామా అంటే బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా పాలుపంచుకున్నారు ముంగిట్లో ఎన్నికలు ఉంచుకుని రెండు రాజకీయ పార్టీల కు చెందిన దిగ్గజ నేతలు ఏమి మాట్లాడుకుంటారు. పక్కాగా రాజకీయాల గురించే అని అంతా భావిస్తున్నారు. అయితే అమిత్ షా నివాసంలో షా బాబు, నడ్డాల మధ్యన ఏమి సంభాషణ జరిగింది. దేని మీద ఒక అభిప్రాయాని కి వచ్చారు అన్నది మూడు రోజులు అయినా బయట కు పొక్కడంలేదు.

దీంతో దీని మీద ఇపుడు మరో చర్చ సాగుతోంది. అదేంటి అంటే ఈ మీటింగ్ అంత ఆనందకరంగా సాగలేదా అన్నది ఒకటి. అంటే టీడీపీ కోరుకున్నట్లుగా ఏపీలో తెలంగాణా లో పొత్తుల కు బీజేపీ ఓకే చెప్పలేదా కేవలం తెలంగాణా వరకే టీడీపీ సాయం కోరుకుందా అన్నది ఒక చర్చ. ఇక తెలంగాణా బీజేపీ నాయకులు టీడీపీ తో పొత్తుకు సుముఖంగా లేరని, అందుకే బీజేపీ నుంచి ఏ హామీ రాలేదని మరొక చర్చ నడుస్తోంది.

ఏపీ లో చూసినా రెండు వర్గాలు బీజేపీ లో ఉన్నాయని, టీడీపీ ప్రో వర్గం హ్యాపీగా ఉంటే రెండవ వర్గం మాత్రం సొంతం గా ఎదుగుదామని అంటోంది. దాంతో తెలుగు రాష్ట్రాల బీజేపీ శాఖల నేతల అభిప్రాయాల ను పరిగణన లోకి తీసుకుని ఆ మీదటనే ఈ విషయంలో టీడీపీ కి ఒక హామీ ఇవ్వాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ఈ పొత్తును సరైన టైం లోనే బయటపెడతారు అని అంటున్నారు. ఏపీలో వైసీపీ తో కేంద్ర పెద్దలు దోస్తీ చేస్తున్నారు. వారికి ఢిల్లీ అధికారాల విషయంలో తెచ్చిన ఆర్డినెన్స్ కి ఆమోదముద్ర కోసం వైసీపీ ఎంపీల మద్దతు రాజ్యసభలో కావాలి. అంతే కాదు వచ్చే సెషన్ లో కీలక బిల్లుల కూ వైసీపీ అవసరం పడుతుంది. అందుకే సీక్రెట్ గానే దీన్ని ఉంచేశారు అని అంటున్నారు.

ఇక బీజేపీ పెట్టిన షరతుల విషయంలో టీడీపీ అన్ హ్యాపీ గా ఉందని, అందుకే ఆ పార్టీ అనుకూల మీడియా కూడా పెద్దగా ఈ విషయాన్ని హైలెట్ చేయడం లేదని అంటున్నారు. ఆ కండిషన్లు ఏపీ లో ఎక్కువ సీట్లు ఇవ్వాలని తెలంగాణా లో మద్దతుకే పరిమితం కావాలని అన్న ప్రచారంలో ఉంది.

అంతే కాదు ఎన్నికల అనంతరం కూడా టీడీపీ మీద అనుమానాలు ఉన్న నేపధ్యంలో బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లను డిమాండ్ చేస్తోంది అని అంటున్నారు. ఇలా చాలా విషయాలు రెండు పార్టీల మధ్య ఉన్నాయని అంటున్నారు. ఇంకో వైపు తీసుకుంటే బీజేపీ తెలుగుదేశం రాజకీయ అవసరాలను తనకు అనుకూలంగా మార్చుకోవాల ని చూస్తోంది అని అంటున్నారు. దాంతోనే ఈ చర్చలు అనుకున్నంతగా హుషార్ ఇవ్వలేదని అంటున్నారు.

అయితే ఇది ఆరంభం మాత్రమే అని ముందు ముందు మరిన్ని భేటీలు ఉంటాయని అంటున్నారు. తొందర లోనే చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్ళి మోడీ తో కూడా భేటీ అవుతారని అంటున్నారు ఏది ఏమైనా ఈ పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేంతవరకూ బయటపెట్టరాదు అన్నది కూడా రెండు పార్టీల వ్యూహాత్మక ఎత్తుగడగా చెబుతున్నారు. అందుకే ఎంతో హైప్ క్రియేట్ చేసిన బాబు అమిత్ షాల భేటీ ఇపుడు లో ప్రొఫైల్ లోనే ఉండిపోయింది అని అంటున్నారు.