Begin typing your search above and press return to search.

ప‌ట్ట‌ణాల్లో గంజాయి న‌గ‌రాల్లో కొకైన్ ? త‌గ్గేదేల్యా !

By:  Tupaki Desk   |   4 April 2022 1:30 AM GMT
ప‌ట్ట‌ణాల్లో గంజాయి న‌గ‌రాల్లో కొకైన్ ? త‌గ్గేదేల్యా !
X
పోలీసులు జ‌రిపిన మెరుపు దాడుల్లో ప్ర‌ముఖులు ఉంటారు. ఖ‌రీద‌యిన ప్ర‌దేశాల్లో ఖ‌రీద‌యిన మ‌నుషులు చేసే ఖ‌రీదు అయిన నేరాలు వెలుగులోకి వ‌స్తాయి.దేశాలు దాటి ఖండాంతరాలు దాటి మ‌రీ వెలుగులోకి వ‌చ్చిన మ‌త్తు ప‌దార్థాల జాడ‌లు ఇప్పుడిక కొత్త వార్త‌ల‌కు కావాల్సినంత ముడి వ‌నరులు.

ఈ హ‌డావుడి నాలుగు రోజులు. ఆ త‌రువాత ష‌రా మామూలే ! ప‌బ్బు మ‌ళ్లీ తెరుచుకోవ‌డం ఖాయం. ఇంకా ఏవేవో య‌థావిధిగా జ‌ర‌గ‌డం కూడా ఖాయం. డ్ర‌గ్స్ , గ‌న్స్ ఇంకా చాలా అలానే వ‌చ్చి వెళ్తాయి.పోలీసుల చ‌ర్య‌లు అప్ప‌డ‌ప్పుడూ మెరుపు వేగంతో ఉంటాయి కానీ త‌రువాత మంద‌గ‌మ‌న రీతికి చేరుకుంటాయి. ప‌ల్లె మ‌రియు న‌గ‌రం మ‌ధ్య న‌డిచేదే ఇది! ఉగాది తీసుకువ‌చ్చిన విషాదం ఇది !

పల్లెలు ఇది వ‌ర‌కు మాదిరి లేవు. ఆ మాట‌కు వ‌స్తే అవి ఎప్పుడో రూపం మార్చుకుని ఉన్నాయి. నాటా సారా ప్ర‌వాహాలు ఏవీ ఆగ‌వు. ఆగే వీల్లేదు కూడా ! ఇక ప‌ట్ట‌ణాలు గంజాయి ముఠాల‌తో నిండిపోతున్నాయి. పండ‌గ రోజు ప‌ట్ట‌ణాల్లో గంజాయి ముఠాలు విచ్చ‌ల‌విడిగా తిరిగాయి.

వీళ్ల‌కు పోలీసులు గ‌తంలో మాదిరిగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నారు. ఆ మాటలు వినిపించుకోక కొంద‌రు య‌థావిధిగా మ‌ళ్లీ అదే ప‌ద్ధ‌తికి అల‌వాటు ప‌డి హ‌త్య‌ల‌కు తెగ‌ప‌డుతున్నారు. శ్రీ‌కాకుళం ప‌ట్ట‌ణంలో వ‌లంటీర్ ను ఇదే విధంగా ఓ ముఠా చంపేశారు. ఈ హ‌త్య కేసులో ఆరుగురు నిందితులూ యువ‌కులే!

గ‌తంలో వీరిని పోలీసులు పిలిచి గంజాయి వాడ‌కం వ‌ద్ద‌ని కౌన్సిలింగ్ చేసి పంపార‌ని ప్రాథ‌మిక స‌మాచారం ఆధారంగా తెలుస్తోంది. ఇదే విధంగా న‌గ‌రాలు ముఖ్యంగా బంజారాహిల్స్ లాంటి ప్రాంతాలు ప‌బ్బుల‌తో నిండిపోతున్నాయి. కొకైన్ ఎక్క‌డి నుంచి వ‌స్తుందో కానీ వాటితో అవి నిండిపోతున్నాయి. కిటికీ నుంచి 12 ప్యాకెట్లు నిన్న‌టి వేళ విసిరివేశారు. ఓ ప‌బ్ పై జ‌రిగిన దాడిలో వెలుగు చూసిన నిజం ఇది.

పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్ దొరికాయి. కొకైన్ ప్యాకెట్ల‌తో సెల‌బ్రిటీలు కొంద‌రు ప‌ట్టుబడ్డారు. నిహారిక మ‌రియు రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. ఇంకా చాలా మంది పేర్లు వెలుగులోకి రావాల్సి ఉంది. నిఘా వైఫ‌ల్యం ఇది అని అనుకోవాలా లేదా పోలీసులు అప్ర‌మ‌త్తమై ఈ త‌ర‌హా దాడుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని భావించాలా తెలియ‌ని సందిగ్ధ‌త ఒక‌టి నెల‌కొని ఉంది. ఈ ద‌శ‌లో ప‌ట్టుబ‌డిన వారికి నోటీసులు ఇచ్చి పంపారు అని తెలుస్తోంది.

పోలీసులు జ‌రిపిన మెరుపు దాడిలో 150 మందికి పైగా ప‌ట్టుబ‌డ్డారు. ఇక వీరిపై ఎటువంటి చ‌ర్య‌లు ఉండ‌నున్నాయి అన్న‌ది ఆస‌క్తిదాయ‌కం. డ్ర‌గ్స్ వాడకం చ‌ట్ట విరుద్ధం అయినా కూడా చిత్ర సీమ‌లో కొంద‌రు గ‌తంలో ఈ త‌ర‌హా కేసుల్లో ఇరుక్కున్నారు. ఆధారాల‌తో స‌హా ప‌ట్టుబ‌డినా కూడా ఆ కేసులు ఏమ‌య్యాయో ఇవాళ్టికీ తెలియ‌దు. అదే త‌ర‌హాలో తాజా కేసులు కూడా ఏమౌతాయో !