Begin typing your search above and press return to search.

రాహుల్ అన్హరత మీద కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ కీలక నేత

By:  Tupaki Desk   |   25 March 2023 8:30 AM GMT
రాహుల్ అన్హరత మీద కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ కీలక నేత
X
కపిల్ సిబల్ అన్నంతనే కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరు.. ఆ పార్టీకి మిగిలిన అతి కొద్ది థింక్ ట్యాంకర్లలో ఒకరుగా చెప్పాలి. ఆయన గురించి చెప్పాల్సి వస్తే.. యూపీఏ సర్కారులో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన దేశంలోని ప్రముఖ లాయర్లలో ఒకరన్న సంగతి తెలిసిందే. రాహుల్ కు సూరత్ కోర్టు రెండేళ్లు జైలుశిక్ష విధిస్తూ తీరపును వెలువరించటం.. ఆ సందర్భంగా ఆయనపై అనర్హత వేటు వేసినట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆయన స్పందించారు. అనర్హతపై సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టుజైలుశిక్ష విధించిన కేసు నేపథ్యంలో ఆయనపై ఆటోమేటిక్ గా అనర్హతకు గురవుతారని పేర్కొన్నారు. 'గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్లు జైలుశిక్ష విధించింది. వెంటనే బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజులు గడువు ఇచ్చింది. కోర్టు తీర్పుతో రాహుల్ ఆటోమేటిక్ గా అనర్హతకు గురయ్యారు. చట్ట ప్రకారం రాహుల్ అనర్హతకు గురైనట్లే. కోర్టు తీర్పుపై స్టే వస్తేనే ఆయన లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతారు. చట్టప్రకారం ఎవరైనా ప్రజాప్రతినిధి రెండేళ్లు జైలుకు గురైతే ఆ సభ్యుడి స్థానం ఖాళీ అవుతుంది. చట్టానికి అనుగుణంగా లోక్ సభ స్పీకర్ తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది'' అని స్పష్టం చేశారు.

తన వాదనకు తగ్గట్లే.. గతంలో సుప్రీంకోర్టు తీరపును ఆయన ఉటంకించారు. 2013లో లల్లీ థామస్ వర్సస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన కపిల్ సిబల్.. ''ఎంపీ.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు ఎవరైనా సరే ఏదైనా కేసులో దోషిగా తేలి రెండేళ్లు జైలుశిక్ష పడితే.. వారు ఆ పదవికి అనర్హులవుతారు. శిక్షతో తక్షణమే వారికి అనర్హత అమల్లోకి వస్తుంది'' అని స్పష్టం చేయటం గమనార్హం.

అయితే.. రాహుల్ పై అనర్హత వేటు వేసే విషయంలో కేంద్రం దూకుడుగా వ్యవహరించిందన్న విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తున్న వేళలో కాంగ్రెస్ కీలక నేత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
కపిల్ సిబల్ రూల్ పొజిషన్ చెప్పినప్పటికీ.. ఆచరణలో లోక్ సభ స్పీకర్ కాసింత వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తే బాగుంటుందని చెబుతున్నారు. కోర్టు జైలుశిక్ష విధించినంతనే ఆయనపై అనర్హత వేటు ఆటోమేటిక్ అయినా.. ఆయన్ను లోక్ సభ స్థానం నుంచి సస్పెన్షన్ కు గురి చేసే కన్నా.. కాసింత ఆగి నిర్ణయాన్ని తీసుకొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.