Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. సర్వే రిపోర్టు లెక్క చెప్పిన ఫైర్ బ్రాండ్

By:  Tupaki Desk   |   18 Jun 2023 3:29 PM IST
తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. సర్వే రిపోర్టు లెక్క చెప్పిన ఫైర్ బ్రాండ్
X
మరో నాలుగు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి వచ్చేసింది. అధికార.. విపక్షాలు అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరికి వారు తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి వేళలో టీపీసీసీ అధ్యక్షుడు.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ మధ్యనే.. తాము ఒక సర్వే ను నిర్వహించామని..దానికి సంబంధించిన వివరాల్ని రివీల్ చేశారు.

రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ముందంజలో ఉందన్నారు. గతంతో పోలిస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుందన్న ఆయన.. బీజేపీ గ్రాఫ్ పడిపోయినట్లు చెప్పటం గమనార్హం. అయితే.. తాను చెబుతున్న సర్వే వివరాలు ఎవరు చేశారు? ఏ సంస్థ చేసింది? అన్న వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. సీట్ల విషయానికి వస్తే.. మజ్లిస్ కు ఏడు సీట్లు వస్తాయని చెప్పిన రేవంత్.. 'బీఆర్ఎస్ కు 45 స్థానాలు.. కాంగ్రెస్ కు 45 స్థానాలు బీజేపీకి 7 స్థానాలు వస్తాయి. మరో 15 సీట్లలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఉంది' అని చెప్పారు.

ఓట్ల శాతం విషయానికి వస్తే.. బీఆర్ఎస్ కు 37 శాతం.. కాంగ్రెస్ కు 35 శాతం.. బీజేపీకి 14 శాతం.. మజ్లిస్ కు 3 శాతం ఓట్లు పడతాయన్నారు. కేసీఆర్ సర్కారు అమలు చేసిన పథకాలతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. దశాబ్ది ఉత్సవాలు కాదు.. పది వైఫల్యాలుగా అభివర్ణించారు. కేసీఆర్ మోసాలపై అమరుల ఆత్మలు ఘోషిస్తున్నట్లుగా పేర్కొన్న రేవంత్.. ఉద్యమకారులంటే కేసీఆర్ కు ఆసూయ అన్నారు. ఉద్యమం జరిగే వేళలో కేటీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించిన రేవంత్.. కేసీఆర్ ను సీఎంను చేస్తానని బండి సంజయ్ ఇండైరెక్టుగా చెబుతున్నారన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని అంశం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న ఆయన.. అదేమంత ఆషామాషీ వ్యవహారం కాదన్నారు.