Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ తో పోటీపడుతున్న కాంగ్రెస్, బీజేపీ

By:  Tupaki Desk   |   2 Jun 2023 6:00 PM GMT
బీఆర్ఎస్ తో పోటీపడుతున్న కాంగ్రెస్, బీజేపీ
X
ఎన్నికలు, ఓట్లు రాజకీయపార్టీలతో ఎంతటి పనులనైనా చేయిస్తాయి. దీనికి ప్రత్యక్షఉదాహరణ తెలంగాణాలో మొదలైంది. తెలంగాణా ఏర్పడిన జూన్2వ తేదీన కేసీయార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణా అవతరణ వేడుకలను చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్ళయిన సందర్భంగా 22 రోజులపాటు దశాబ్దివేడుకలను ఘనంగా చేయాలని కేసీయార్ ఆదేశించారు. అధికారపార్టీ కాబట్టి వేడుకలను ఘనంగా చేయాలని కోరుకోవటంలో, చేయటంలో తప్పేలేదు. ఎందుకంటే గడచిన పదేళ్ళుగా ప్రభుత్వం వేడుకలను చేస్తునే ఉంది కాబట్టి.

అయితే ఈ వేడుకలను ఇపుడు కాంగ్రెస్, బీజేపీలు కూడా చేయటానికి పోటీలు పడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని గతంలో కాంగ్రెస్, బీజేపీలు పెద్దగా పట్టించుకోలేదు.

ఇపుడు మాత్రం కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో భారీ వేడుకలు చేస్తోంది. ఏఐసీసీ నుండి ప్రత్యేకంగా మీరాకుమార్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. సోనియాగాంధీ లేదా ప్రియాంకగాంధీనే రావాల్సింది. కానీ వాళ్ళు బిజీ కావటంతో మీరాకుమార్ ను పంపారు.

ఇక బీజేపీ విషయం చూస్తే వేడుకలను కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోంది. గోల్కొండ కోటను బ్రహ్మాండంగా ముస్తాబుచేసి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించింది. వేడుకలను చేయటంతో బీఆర్ఎస్ తో కాంగ్రెస్, బీజేపీ ఎందుకు పోటీపడుతున్నాయి ? ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టే.

రాబోయే డిసెంబర్లో ఎన్నికలు జరుగుతుందని అందరు అనుకుంటున్నారు. ఇపుడుగనుక తెలంగాణా ఆవిర్భావ వేడుకలు జరపకపోతే జరపని పార్టీలను కేసీయార్ తెలంగాణా వ్యతిరేకులుగా ముద్రవేసే అవకాశముంది.

అందుకనే బీఆర్ఎస్ తో పోటీగా పై రెండుపార్టీలు కూడా ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణా ఇచ్చింది తామే..తెచ్చిందీ తామే అని కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్నారు. ఇదే సమయంలో తమ దివంగత నేత సుష్మాస్వరాజ్ పార్లమెంటులో కీలకపాత్ర పోషించబట్టే తెలంగాణా వచ్చిందని బీజేపీ నేతలు ఊదరగొడుతున్నారు. మొత్తంమీద తెలంగాణా సాధన క్రెడిట్ ను తమదే అంటే తమదే అని మూడుపార్టీలు జనాలకు చెప్పుకుంటున్నాయి. మరి ప్రజలు ఎవరిమాట నమ్ముతారు ? రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓట్లేస్తారు ?