Begin typing your search above and press return to search.

'కర్ణాటకానికి' తెర.. సీఎం, డిప్యూటీ సీఎం వీరే!

By:  Tupaki Desk   |   18 May 2023 1:16 PM GMT
కర్ణాటకానికి తెర.. సీఎం, డిప్యూటీ సీఎం వీరే!
X
మే 13న ఫలితాలు వెలువడి కాంగ్రెస్‌ గెలిచినప్పటి నుంచి కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఓవైపు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇంకోవైపు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ పార్టీ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు.

224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ 135 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 113ను ఆ పార్టీ దాటింది. దీంతో ఎవరి మద్దతు అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో మంత్రి పదవులు దక్కించుకోవడానికి నేతల మధ్య తీవ్ర పోటీ ఉంది.

కాగా ముఖ్యమంత్రి పీఠంపై ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రతినిధులు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ చర్చోపచర్చల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేశారు.

ముఖ్యమంత్రిగా దాదాపు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సిద్ధరామయ్యను ఫైనల్‌ చేశారు. ఇక దాదాపు ఒంటి చేత్తో కాంగ్రెస్‌ కు విజయాన్ని కట్టబెట్టిన డీకే శివకుమార్‌ కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవి కూడా శివకుమార్‌ వద్దే ఉంటుంది. శివకుమార్‌ తోపాటు దళితులు, మైనారిటీలు, లింగాయత్‌ ల నుంచి ఒక్కోరు డిప్యూటీ సీఎంగాలుగా ఉంటారని వార్తలు వచ్చినా శివకుమార్‌ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు.

సీనియారిటికే పార్టీ హైకమాండ్‌ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యేలు సైతం సిద్ధరామయ్యకే మద్దతు ఇస్తుండటంతో సీఎంగా ఆయననే ఎంపిక చేశారని తెలుస్తోంది. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, అలాగే మరికొంతమంది మంత్రులు మే 20 ప్రమాణస్వీకారం చేస్తారని కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు.

రాహుల్‌ గాంధీతోపాటు ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది సిద్ధరామయ్యను సపోర్ట్‌ చేశారని సమాచారం. ఇక సోనియా గాంధీతోపాటు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డీకే శివకుమార్‌ వైపు మొగ్గు చూపారు. అయితే డీకే శివకుమార్‌ పై ఈడీ, సీబీఐ కేసులు ఉండటం ఆయనకు ప్రతిబంధకంగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించారని తెలుస్తోంది.

కాగా 2013 నుంచి 2018 వరకు సిద్ధరామయ్య ఐదేళ్లపాటు కర్ణాటక సీఎంగా పనిచేశారు. ఎలాంటి వివాదాలు, పెద్దగా అవినీతి ఆరోపణలు లేకుండా తన పదవీకాలాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా అహింద వర్గాల (దళితులు, బీసీలు, మైనార్టీలు) ప్రతినిధిగా సిద్ధరామయ్యకు పేరుంది. దీంతో ఆయన వైపే కాంగ్రెస్‌ అధిష్టానం మొగ్గు చూపిందని చెబుతున్నారు.

ఇక డీకే శివకుమార్‌ కు కర్ణాటక పీసీ అధ్యక్ష పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి, కీలక మంత్రిత్వ శాఖలు దక్కుతాయి. ఇప్పటికే పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు. పార్టీ తనకు కన్నతల్లి లాంటిదని పార్టీని చీల్చబోనని, వెన్నుపోటు పొడవబోనని వెల్లడించారు.

కాగా తాను సీఎం రేస్‌ నుంచి ఎందుకు తప్పుకున్నానో డీకే శివకుమార్‌ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తనకు సీఎం పదవికంటే కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తు ఎక్కువ అని చెప్పారు. పార్టీకి చెడ్డపేరు రాకూడదు అని తాను సీఎం రేసు నుంచి తప్పుకున్నానని వెల్లడించారు.

తన పదవి కంటే ప్రజల యోగక్షేమాలు ముఖ్యం అని డీకే శివకుమార్‌ చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నేరవేర్చడానికి తమకు అవకాశం వచ్చిందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికే సీఎం సీటు కోసం రాద్దాంతం చెయ్యకూడదని తాను సీఎం సీటు రేస్‌ నుంచి తప్పుకున్నానని పేర్కొన్నారు.