Begin typing your search above and press return to search.

పార్లమెంటు భవనానికి డిసెంబర్ లో శంకుస్ధాపన

By:  Tupaki Desk   |   24 Oct 2020 10:50 AM GMT
పార్లమెంటు భవనానికి డిసెంబర్ లో శంకుస్ధాపన
X
కొత్తగా నిర్మించాలని అనుకున్న పార్లమెంటు భవనానికి రానున్న డిసెంబర్లో శంకుస్ధాపన జరగబోతోంది. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించనున్న ఈ భవనానికి రూ. 861 కోట్లు ఖర్చవుతుంది. నిర్మాణ పనులను డిసెంబర్లో మొదలుపెట్టి 2022 అక్టోబర్ కల్లా పూర్తిచేయాలని కేంద్రం డిసైడ్ చేసింది. లోక్ సభలో 888 సీట్లు, రాజ్యసభలో 384 సీట్లను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుత లోక్ సభలో లేని సౌకర్యాలను కొత్తగా నిర్మించబోయే భవనంలో ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పింది. కల్పించాల్సిన సౌకర్యాలేమిటనే విషయంలో ముందుగానే కేంద్రం స్పష్టంగా చెప్పింది.

కొత్తగా కట్టబోతున్న భవనంలో ప్రతి ఎంపీకి ప్రత్యేకంగా ఆఫీసును కేటాయించబోతున్నారు. అలాగే సభలో ప్రతి ఇద్దరు ఎంపిలకు ఓ బ్లాక్ ఉండేలా డిజైన్ చేశారు. ప్రాంగణం మొత్తం మీద డిజిటల్ స్ర్కీనులు ఏర్పాటు చేయబోతున్నారు. లోక్ సభ, రాజ్యసభ చాంబర్లతో పాటు కొత్తగా భారీ స్ధాయిలో కన్ స్టిట్యూషన్ హాలును కూడా ఏర్పాటు చేయబోతోంది. ఈ హాలులో రాజ్యాంగం ఒరిజినల్ వెర్షన్ ను ఉంచబోతున్నారు. దీనితో పాటు ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజిటల్ డిస్ ప్లే ఏర్పాటు చేస్తున్నారు.

కొత్త భవనంలో విశాలమైన ఎంపిల లాంజ్, గ్రంధాలయం, ఆరు కమిటీ రూములు, డైనింగ్ ఏరియా, ఎంపిలకు, సందర్శకులకు ప్రత్యేకంగా క్యాంటిన్లు, వాహనాలకు పార్కింగ్ స్పేస్ తదితరాలుంటాయి. కొత్త భవనం పనులు స్పీడుగా జరిగేందుకు వీలుగా పార్లమెంటు సచివాలయం ఉన్నతాధికారులతో స్పీకర్ ఓం బిర్లా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలన్నీ రోజువారి పనులను పర్యవేక్షిస్తాయి. ఇదే విషయమై స్పీకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టాటా ప్రాజెక్ట్స్ ప్రతినిధులు భవన నిర్మాణం తాలూకు వివరాలను వివరించారు. పార్లమెంటు సభ్యుల రాకపోకలు, వివిఐపిల రాకపోకలకు చేసిన ఏర్పాట్లు, గార్డెన్ తదితరాలు ఎక్కడ వచ్చేది కూడా ఓం బిర్లాకు చెప్పారు. మొత్తం మీద మన పార్లమెంటుకు కొత్త భవనం తొందరలోనే ఏర్పాటు కాబోతోంది.