Begin typing your search above and press return to search.

ప‌చ్చ‌బొట్టేసుకున్న‌ పిల్ల‌గాళ్లు.. మైదానంలో దంచికొట్టే పోర‌గాళ్లు..!

By:  Tupaki Desk   |   30 April 2021 12:30 AM GMT
ప‌చ్చ‌బొట్టేసుకున్న‌ పిల్ల‌గాళ్లు.. మైదానంలో దంచికొట్టే పోర‌గాళ్లు..!
X
త‌న‌ వారిపై త‌న‌కున్న ప్రేమ.. మాట‌ల్లో చెప్ప‌లేనిద‌ని భావించిన‌ప్పుడు ఎలా చూపించాలి? ప‌లానా విష‌యంపై త‌న ఇష్టం వ‌ర్ణించ‌లేనిద‌ని ఏవిధంగా చాటి చెప్పాలి? అనుకునేవారికి క‌నిపించే ఏకైక ఆప్ష‌న్ ప‌చ్చ‌బొట్టు. ఒంటిపై త‌న ఇష్టాన్ని ముద్రించుకోవ‌డం ద్వారా.. అది త‌నలో క‌లిసిపోయింద‌ని అర్థం. త‌న జీవితంతో పెన‌వేసుకుపోయింద‌ని అర్థం. దేహం మ‌ట్టిలో క‌లిసిపోయే వెన్నంటే ఉంటుంద‌ని అర్థం.

అలాంటి ప‌చ్చ‌బొట్టు గ‌తంలో రెండు మూడు ప‌దాల‌కు ప‌రిమితం అయ్యేది. ఆ త‌ర్వాత చిన్నా చిత‌కా బొమ్మ‌ల‌కు విస్త‌రించింది. ఇప్పుడైతే ఏకంగా.. ఒళ్లంతా పాకుతోంది. అవును.. ఒంటి నిండి టాటూలు వేయించుకుంటున్నారు. గ‌తంలో కొన్ని దేశాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ సంస్కృతి.. ఇప్పుడు ప్ర‌పంచం మొత్తానికి పాకింది. ఇలాంటి టాటూలు వేసుకొని మైదానంలో సంద‌డి చేస్తున్నారు కొంద‌రు క్రికెట‌ర్లు. మ‌రి, వారెవ‌రు? వారి ఒంటిపై ఉన్న టాటూలూ ఏంటీ? వాటి వెనకున్న అర్థాలు ఏంటీ? అన్న‌ది చూద్దామా??

విరాట్ కోహ్లీః టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఒంటిపై ఏకంగా 11 ప‌చ్చ‌బొట్లు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో క‌థ‌ ఉంది. అత‌ని పేరెంట్స్ పేర్లు, రాశీ చ‌క్రం, వ‌న్డే క్రికెట్ జెర్సీ నెంబ‌ర్‌, మ‌హా శివుడు.. ఇలా మొత్తం ప‌ద‌కొండు టాటూలు వేయించుకున్నాడు. ఇవ‌న్నీ.. త‌న వ్యక్తిత్వాన్ని, త‌న ల‌క్ష‌ణాన్ని సూచిస్తాయ‌ని చెబుతుంటాడీ కోహ్లీ.

శిఖ‌ర్ ధావ‌న్ః టీమిండియా ఓపెన‌ర్ గా దుమ్ములేపే శిఖ‌ర్ ధావ‌న్ కూడా టాటూల‌తో అల‌రిస్తూ ఉంటాడు. లెఫ్ట్ హ్యాండ‌ర్ గా ప్ర‌త్య‌ర్థుల‌త‌పై రెచ్చిపోయే ధ‌వ‌న్‌.. కుడిచేతి మొత్తాన్ని టాటూల‌తో నింపేశాడు. ఒంటిపైనా ప‌లు చోట్ల ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నాడు. ఇందులో ఒకే ఒక ప‌క్షి ఉన్న చెట్టు ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంటుంది.

సూర్య‌కుమార్ః బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ మొత్తం 18 టాటూలు క‌లిగి ఉన్నాడు. అయితే.. ఈ టాటూల్లో లెఫ్ట్ హ్యాండ్ మొత్తాన్ని క‌వ‌ర్ చేసే టాటూ ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. అందులో ఏమేం ఉన్నాయ‌నేది క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే త‌ప్ప అర్థం కాదు. కుడి చేతిభుజం మీద మాత్రం త‌ల్లిదండ్రుల ఫొటోను ప‌చ్చ‌పొడిపించుకున్నాడు.

హార్దిక్ పాండ్యాః టీమిండియా హిట్ట‌ర్ హార్దిక్ పాండ్యా కూడా ఒంటిపై టాటూల‌తో క‌నిపిస్తుంటాడు. ప్ర‌థానంగా అత‌ని చేతిపై ఉన్న సింహం టాటూ ఆక‌ట్టుకుంటుంది. ఇంకా.. మిగిలిన టాటూలు అత‌న్ని ఇష్టాల‌ను తెలియ‌జేస్తుంటాయి.

చాహ‌ల్ః టీమిండియా స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ చాతిపై కూడా సింహం గ‌ర్జిస్తూ ఉంటుంది. కుడి భుజం మీదుగా చాతివైపు దూసుకొచ్చిన‌ట్టుగా క‌నిపించే ల‌య‌న్‌.. అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.

కేఎల్ రాహుల్ః సిక్స్ ప్యాక్ బాడీతో అల‌రించే రాహుల్ ఒంటిపైనా టాటూలు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. ఎడ‌మ చేతి మొత్తాన్ని ఓ టాటూ క‌వ‌ర్ చేస్తుండ‌గా.. కుడిచేతిపై మ‌రో టాటూ వేసుకున్నాడు. న‌డుమ భాగంలో మ‌రొక‌టి దింపేశాడు. ఇక‌, వీపు వెనుక భాగంలో అత‌ని పెంపుడు కుక్క టాటూ వేయించుకున్నాడు.

క్రిస్‌ గేల్ః విండీస్ విధ్వంస‌క‌ర బ్యాట్స్ మెన్ గేల్ కూడా చాతి నిండా టాటూ వేయించుకున్నాడు. దేహం మొత్తాన్ని ఆక్ర‌మించిన సింహం.. గేల్ గుండెల‌పై క‌నిపిస్తూ ఉంటుంది.

బెన్ స్టోక్స్ః ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ బెన్ స్టోక్స్ టాటూలు చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోవాల్సిందే. అత‌ని శ‌రీరం ఎక్క‌డా క‌నిపించ‌దు. మొత్తం టాటూలే క‌నిపిస్తాయి. అత‌ని వీపు మొత్తం ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నాడు. అందులో ఆడ‌, మ‌గ సింహాలు.. వాటికి సంబంధించిన రెండు పిల్ల‌లు ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు తాను, త‌న భార్య‌.. ఇద్ద‌రు పిల్ల‌ల ప్ర‌తీక‌లు అని చెబుతుంటాడు స్టోక్స్‌. ఈ టాటూ వేయ‌డానికి దాదాపు 30 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ట‌.