Begin typing your search above and press return to search.

91 ఏళ్ల వయసులోనూ ప్రేమాయణం

By:  Tupaki Desk   |   28 Feb 2023 12:45 PM GMT
91 ఏళ్ల వయసులోనూ ప్రేమాయణం
X
దేశ రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజం ఎవరంటే.. ఠక్కున గుర్తొచ్చే పేరు ఆ సంస్థదే. దేశంలోని సంపన్నుల్లో ఆయనా ఒకరు.. 60 ఏళ్ల వ్యాపార అనుభవం.. లక్షల కోట్ల టర్నోవర్ ను చూసిన ఘనత.. ప్రపంచ వ్యాప్తంగా సంబంధాలు.. వారసులు వ్యాపారంలో రాణిస్తున్నారు.. కావాలనుకుంటే ఎందరో సేవకులు.. అంతా సాటిస్ఫయిడ్ లైఫ్.. కానీ, ఆయనను ఒంటరితనం వెంటాడింది.. 90 ఏళ్ల వయసులోనూ తోడు కోరుకునేలా చేసింది. 65 ఏళ్లపాటు కలిసిమెలిసి ఉన్న భార్య మరణం తాలూకు దిగ్భ్రాంతి నుంచి బయటపడేందుకు అది అవసరమైంది కూడా..

ఒంటరితనం మహా భయంకరం

ప్రపంచంలో అత్యంత భయకరమైనది ఒంటరితనం. చుట్టూ ఎంతమంది ఉన్నా.. నా అనేవారు లేకుంటే అది చెప్పలేనంత బాధ. అది కూడా 90 ఏళ్ల వయసులో అంటే.. మరీ కష్టం. రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ (డీఎల్‌ఎఫ్) యజమాని కుశాల్ పాల్ సింగ్ ను అదే వెంటాడింది. కేపీ సింగ్‌ గా ప్రసిద్ధులైన ఆయన వయసు ఇప్పుడు 91 ఏళ్లు. ఈ వయసులోనూ ప్రేమలో పడ్డానని చెబుతూ.. ఆమె ఎవరు అనేది వివరాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందిరే ఆయనకు సర్వస్వం కేపీ సింగ్ భార్య ఇందిర. 1953లో వీరి వివాహమైంది. 65 ఏళ్ల పాటు తోడునీడలా మెలిగారు. ఇందిర 2018లో చనిపోయారు. దీంతో కేపీ సింగ్ ఒంటరి అయ్యారు.

ఆమె గురించి కేపీ సింగ్ అద్భుతంగా చెప్తారు. ''నాకు సంపూర్ణ మద్దతునిచ్చే మిత్రురాలు నా భార్యే. మేము మంచి భాగస్వాములం. ఆమెను కాపాడుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాను. ఆమె మరణంతో మానసిక కుంగుబాటుకు గురయ్యాను'' అని పేర్కొంటరారు. అయితే, ఇప్పుడు తనకు ఓ తోడు దొరికిందని ప్రకటించారు. 65 ఏళ్ల బంధం తర్వాత భాగస్వామిని కోల్పోతే.. ఇదివరికటిలా ఉత్సాహంగా ఉండలేమని పేర్కొన్నారు. భిన్నంగా ఆలోచిస్తారని అందుకే జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని వివరించారు. జీవితంలో మనిషికి ఓ భాగస్వామి ఎంత ముఖ్యమో తెలిపారు. ఇక తన కొత్త స్నేహితురాలి విశేషాలను ఆయన ఓ ఆంగ్ల మీడియా ఛానల్‌తో పంచుకొన్నారు.

సరికొత్త భాగస్వామ్యంపై..

2018లో చనిపోవడానికి ఆరు నెలల ముందు ఇందిర తనతో మాట్లాడుతూ.. చేస్తున్న పనులను వదిలేయ వద్దని కోరినట్లు కేపీ సింగ్ చెప్పారు. ''సంతోషంగా జీవించే జంట కోరిక ఒక్కటే.. జీవన ప్రయాణంలో ఇద్దరూ కలిసి వెళ్లాలని. ఏ ఒక్కరు ఒంటరిగా మిగిలిపోకూడదు. కానీ నా విషయంలో ఏమైంది.. నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించావు. కానీ, కొన్ని నెలల్లో నేను నిన్ను వదిలి వెళ్లిపోతున్నాను. అందుకే.. నేను వెళ్లిపోయినా.. నీ ముందు చాలా జీవితం ఉంది. నాకో మాటివ్వు.. నా తర్వాత కూడా నీ జీవితంలో నిరాశపడకు. అది ఏరకంగా నీకు సాయం చేయదు. ఈ జీవితం మళ్లీ నీకు తిరిగిరాదు'' అని కోరినట్లు తెలిపారు.

ఇక 2018లో ఆమె మరణం తర్వాత దాదాపు రెండేళ్లు తీవ్రమైన ఒంటరితనంలో జీవించినట్లు సింగ్‌ వెల్లడించారు. ఆ తర్వాత ఓ జీవిత భాగస్వామి దొరికనట్లు వెల్లడించారు. ''నేను చాలా అదృష్టవంతుడిని. ఓ మనోహరమైన వ్యక్తిని కలిశాను. ఇప్పుడు తను నా భాగస్వామి. ఆమె పేరు షీనా. నేను జీవితంలో కలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో ఆమె ఒకరు. ఆమె చాలా హుషారుగా ఉంటారు. నన్ను ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుతున్నారు. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా చాలా అద్భుతమైన మిత్రులు ఉన్నారు. నేను ఎప్పుడైనా జీవితంలో నిరాశకు గురైనా.. ఆమె నన్ను ప్రోత్సహిస్తుంది. నేను ఈ రోజు ఉత్సాహంగా ఉన్నానంటే ఆమే కారణమని చెబుతాను'' అని సింగ్‌ వెల్లడించారు.

భార్య మరణం తర్వాత నుంచి కంపెనీ యాజమాన్యంలో చురుకైన పాత్ర నుంచి వైదొలుగుతున్నట్లు సింగ్‌ చెప్పారు. ప్రేమించిన వారు దూరం కావడం, వయసు 91 ఏళ్లకు చేరడంతో నిర్ణయాలు తీసుకునే ప్రతిస్పందన తత్వం నెమ్మదిస్తుందన్నారు. కంపెనీ కోసం పనిచేసే సమయంలో పాజిటివ్‌గా ఉండటం చాలా ముఖ్యమని భావించినట్లు వివరించారు. కానీ, బాధల్లో ఉండటంతో పూర్తి సేవలు అందించలేని పరిస్థితి నెలకొందని.. అందుకే తాను యాజమాన్యం నుంచి దూరమైనట్లు సింగ్‌ వెల్లడించారు. ''మీకు 90 ఏళ్లు వస్తే.. ఓ లిస్టెడ్‌ కంపెనీ యాక్టివ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి కచ్చితంగా వైదొలగాలి. ఇక నా కుమారుడు యాజమాన్య బాధ్యతలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకొన్నాను. నేను ఇంకా కొనసాగే రకం కాదు. అందుకే 'గౌరవ' పదవిలో మాత్రమే కొనసాగుతున్నాను. వాస్తవానికి నా కుమారుడు నాకంటే మెరుగ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కంపెనీని వేగంగా ముందుకు తీసుకెళుతున్నాడు. విలువల విషయంలో రాజీపడలేదు. అందుకే నేను సంతోషంగా ఉన్నాను'' అని చెప్పారు.

మిగిలిన జీవితం నాకోసం..

పని నుంచి తనను తాను దూరంగా ఉంచుకోవాలని సింగ్‌ భావిస్తున్నారు. ఇక నుంచి తనకు ఇష్టమైన పనులు చేయడం కోసం సమయాన్ని వెచ్చించనున్నారు. ''నాకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున మిత్రులు, స్నేహ సంబంధాలు ఉన్నాయి. నేను గోల్ఫ్‌ ఆటగాడిని కూడా. చాలా చురుగ్గా ఉన్నాను'' అని సింగ్‌ వివరించారు. కాగా, ఇటీవల బిలియనీర్‌ జార్జిసోరస్‌ వృద్ధాప్యం కారణంగా అదానీ-హిండెన్‌ బర్గ్‌ వ్యవహారం, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఆరోపణలపై సింగ్‌ స్పందించారు. ''ప్రస్తుతం నా వయసు ఎంత..? చాలా మంది 70 ఏళ్లు అనుకొంటారు. ఎందుకంటే నేను చురుగ్గా ఉన్నాను కాబట్టి'' అంటూ సింగ్‌ పెద్దగా నవ్వేశారు. తన మామయ్య స్థాపించిన డీఎల్‌ఎఫ్‌లో 1961లో కేపీ సింగ్‌ చేరారు. దాదాపు 5 దశాబ్దాలపాటు కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2020లో ఛైర్మన్‌గా పదవీవిరమణ చేశారు. సింగ్‌ ప్రస్తుత ఆస్తి రూ.66 వేల కోట్లు ఉంటుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.