Begin typing your search above and press return to search.

ద‌ళిత బందు అంద‌రికీ అన్నారు.. మ‌రి ఇప్పుడు స‌ర్వే ఎందుకు?

By:  Tupaki Desk   |   26 Aug 2021 2:30 PM GMT
ద‌ళిత బందు అంద‌రికీ అన్నారు.. మ‌రి ఇప్పుడు స‌ర్వే ఎందుకు?
X
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆ దిశ‌గా ద‌ళితుల ఓట్ల‌ను ఆక‌ట్టుకోవ‌డం కోసం మొట్ట‌మొద‌టిగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ద‌ళిత బంధు ప‌త‌కానికి శ్రీకారం చుట్టారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంతో మొద‌లెట్టి రాష్ట్రవ్యాప్తంగా ద‌ళితుల కుటుంబాల‌న్నింటికీ ప్రాధాన్య క్ర‌మంలో రూ.10 ల‌క్ష‌లు అందిస్తామ‌ని ప్ర‌భుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబాల‌కూ ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేస్తామ‌ని బ‌హిరంగ స‌భ వేదిక‌గా కేసీఆర్ ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు ఆయ‌న మాట‌ల‌కు.. ప్ర‌భుత్వ కార్య‌చ‌ర‌ణ‌కు పొంతన ఉండ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ద‌ళిత బంధు ప‌థ‌కానికి అర్హుల‌ను ఎంపిక చేయ‌డం కోసం ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేయ‌డంతో పాటు హుజూరాబాద్‌లో శుక్రవారం నుంచి స‌ర్వే నిర్వహించ‌బోతుండ‌డం అనుమానాల‌కు తావిస్తోంది.

హుజూరాబాద్‌కు మాత్ర‌మే కాకుండా రాష్ట్రమంత‌టా ద‌ళిత కుటుంబాల‌న్నింటికీ ద‌ళిత బంధును అమ‌లు చేస్తామ‌ని కేసీఆర్ చెప్పారు. కానీ ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ ప‌థ‌కానికి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు నిర్దిష్ట ప్ర‌మాణాలను ప్రభుత్వం రూపొందించింది. వాటి ఆధారంగానే ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. ఆ విధి విధానాల ప్ర‌కార‌మే ఇప్పుడు రెవెన్యూ, మున్సిప‌ల్‌, పంచాయ‌తీరాజ్ త‌దిత‌ర శాఖ‌ల సిబ్బంది హుజూరాబాద్‌లో స‌ర్వే చేప‌ట్ట‌నున్నారు. మొత్తం 48 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను ద‌ళిత‌ల నుంచి రాబ‌ట్ట‌నున్నారు. నాలుగు రోజుల్లోనే ఈ స‌ర్వేను పూర్తి చేయాల‌నే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌త్త‌త గ్రామం వాసాల‌మర్రిలో మొత్తం 76 ద‌ళిత కుటుంబాల‌కు, హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో సుమారు 23వేల కుటుంబాల‌కు ద‌ళిత బంధు కింద సాయం చేస్తామ‌ని సీఎం పేర్కొన్నారు. ఈ మేర‌కు వాసాలమ‌ర్రి గ్రామానికి రూ.760 కోట్లు, హుజూరాబాద్‌ఖు రూ.1200 కోట్లు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. కానీ మ‌రోవైపు ల‌బ్ధిదారుల ఎంపిక మాత్రం మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం జ‌ర‌గ‌నున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. దీంతో సీఏం చెప్పిన మాట‌ల‌ను చేసే ప‌నుల‌కు పొంతన లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ద‌శ‌ల వారీగా రాష్ట్రమంత‌టా ద‌ళిత కుటుంబాల‌కు ద‌ళిత బంధును అమ‌లు చేస్తామ‌ని సీఏం చెప్పిన త‌ర్వాత మ‌ళ్లీ ఈ స‌ర్వే చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఏముంద‌నే ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కార‌మే ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేయాల‌నే ఈ కొత్త మెళిక ఎందుకు పెట్టార‌నే విష‌యం అంతుప‌ట్ట‌కుండా ఉంది. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. తెలంగాణ‌లో నివాసం ఉన్న కుటుంబాలు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి విభాగం జీవో నంబ‌ర్ 5 ప్ర‌కారం ద‌ళిత క‌మ్యూనిటీకి చెందివారు మాత్ర‌మే అర్హులు. ఆ కుటుంబం వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.50 ల‌క్ష‌లు, ప‌ట్ట‌ణాల్లో రూ.2.50 ల‌క్ష‌లు మించ‌కూడ‌దు. ఆ కుటుంబానికి రెండున్న‌ర ఎక‌రాల మాగాణీ లేదా మెట్ట‌తో క‌లిపి మొత్తం 5 ఎక‌రాల‌కు మించి సాగుభూమి ఉండ‌కూడ‌దు. ఆ కుటుంబంలో ఎవ‌రికీ కేంద్ర లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగం ఉండ‌కూడ‌దు. రిటైర్డ్ ఉద్యోగులూ ఉండ‌కూడ‌దు. కుటుంబం మొత్తానికి మించి ప‌ది గుంట‌ల‌కు మించి నివాస స్థ‌లం ఉండ‌కూడ‌దు. వ్య‌క్తిగ‌తంగా ఫోర్ వీల‌ర్ కూడా ఉండ‌కూడ‌దు.

స‌ర్వేలో ఈ విష‌యాల‌తో పాటు ఇంట్లో ఏమేమీ వ‌స్తువులున్నాయి ఇప్ప‌టికే ఏమైనా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందాయా? ఏ వ్యాపారం చేస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నారు? లాంటి పూర్తి విష‌యాల‌ను సేక‌రించ‌నున్నారు. దీంతో హుజూరాబాద్‌లోని ద‌ళిత కుటుంబాల‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆ సామాజిక వ‌ర్గాన్ని చెందిన ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ద‌ళిత కుటుంబాలంద‌రికీ అమ‌లు చేస్తామ‌ని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌పై ఏమంటార‌నే ఆస‌క్తి నెల‌కొంది.