Begin typing your search above and press return to search.

రైతుల ఉపాధి కోసం సత్య నాదెళ్ల వైఫ్ ఏం చేశారో తెలుసా?

By:  Tupaki Desk   |   14 Sep 2020 3:30 AM GMT
రైతుల ఉపాధి కోసం సత్య నాదెళ్ల వైఫ్ ఏం చేశారో తెలుసా?
X
తెలుగు నేలకు చెందిన సత్య నాదెళ్ల సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కే అధిపతిగా కొనసాగుతూ తెలుగోడి సత్తా చాటుతుంటే... ఆయన సతీమణి అనుపమ దాతృత్వంలో సత్తా చాటుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలోనే దాదాపుగా స్థిరపడిపోయిన నాదెళ్ల దంపతులు..ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే... లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు రైతులు, రైతు కూలీలు ఉపాధి కరువై పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని అనుపమ చలించి పోయారట. ఆ వెంటనే రైతులు, రైతు కూలీల ఉపాధి కోసం ఏకంగా రూ.2 కోట్ల విరాళాన్ని అనుపమ ప్రకటించారు, సదరు మొత్తాన్ని సత్య నాదెళ్ల సొంత జిల్లా అనంతపురంలో రైతు శ్రేయస్సు కోసం పని చేస్తున్న అనంతపురం యాక్షన్ ప్రేటార్నా ఎకాలజీ సెంటర్ కు పంపారు.

జిల్లా రైతులు, రైతు కూలీల కోసం అనుమప చేసిన సాయం పై అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హర్షం ప్రకటించారు. ఇక అనుపమ నుంచి రూ.2 కోట్ల విరాళాన్ని అందుకున్న ప్రేటార్నా ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవీ మల్లా రెడ్డి... ఆ నిధుల తో రైతులు, రైతు కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తంగా అమెరికా లో ఉన్నా కూడా సొంత జిల్లా ను, అక్కడి రైతులు, రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని చలించిన అనుపమ తన దాతృత్వాన్ని చాటుకున్నారనే చెప్పక తప్పదు.

సత్య నాదెళ్ల తండ్రితో పాటు అనుపమ తండ్రి కూడా ఐఏఎస్ అదికారులుగా పనిచేసిన వారే. ఈ క్రమంలోనే సత్య నాదెళ్లతో అనుపమ పెళ్లి జరిగింది. ఐఏఎస్ అయిన తండ్రి ఏపీలోని పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు. ఈ క్రమంలో తండ్రితో పాటు అనుపమ కూడా పలు ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పల్లె సీమలు, వాటిలోని రైతులు, రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులు ఎలాంటివో అనుపమకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ అసలే కరువు జిల్లా అయిన అనంతపురంలో రైతులు, రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న అనుపమ... తనవంతుగా రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారట.