Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మహానగరానికి డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయ్

By:  Tupaki Desk   |   8 Feb 2023 9:55 AM
హైదరాబాద్ మహానగరానికి డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయ్
X
అధికారం చేతిలో ఉన్న వారి మనసును దోచుకునే మాట ఏదైనా.. అది వాస్తవ రూపం దాలుస్తుంది. కొంతకాలం క్రితం ఒక నెటిజన్ చేసిన ట్వీట్.. దానికి మంత్రి కేటీఆర్ రియాక్టు కావటం కట్ చేస్తే.. తాజాగా హైదరాబాద్ మహానగర రోడ్ల మీదకు డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయి. హైదరాబాద్ మహానగర చరిత్రలో డబుల్ డెక్కర్ బస్సుల చరిత్ర గురించి తెలిసిందే. నిజాం హయాంలోనే డబుల్ డెక్కర్ బస్సులు మొదలయ్యాయి.

ఆ బస్సులు 2003 వరకు నగరంలో తిరిగాయి. ఆ తర్వాత అవి కాస్తా అదృశ్యం అయ్యాయి. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఒక నెటిజన్ తన ట్వీట్ లో హైదరాబాద్ మహానగర రోడ్ల మీదకు మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల్ని తీసుకురావాల్సిందిగా కోరారు. నెటిజన్ కోరికను మంత్రి కేటీఆర్ మన్నించటమే కాదు.. దీని గురించి ఆలోచించాల్సిందిగా ప్రభుత్వ అధికారుల్ని కోరారు. మంత్రి కేటీఆర్ నోటి నుంచి దీని సంగతి చూడాలన్న మాట రావటం.. అది కూడా సోషల్ మీడియాలో రావటంతో.. అధికారుల్లో కదలిక మొదలైంది. ఆ తర్వాత కూడా కేటీఆర్ ఫాలో అప్ సాగటంతో డబుల్ డెక్కర్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

కేటీఆర్ ఆదేశాల నేపథ్యంలో హెచ్ ఎండీఏ (హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ) సంస్థ ఆరు డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ పెట్టగా.. మూడు బస్సులు వచ్చాయి. మరో మూడు త్వరలోనే రానున్నాయి. ఈ డబుల్ డెక్కర్ బస్సుల సంఖ్యను 20 వరకు తీసుకెళ్లటమే లక్ష్యంగా చెబుతున్నారు.

ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల సంగతిని చూస్తే.. ఒక్కో బస్సును రూ.2.16 కోట్లతో కొనుగోలు చేవారు. మూడేళ్ల పాటు బస్సుల నిర్వహణ కాంట్రాక్ట్ కొనసాగుతుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150కి.మీ. ప్రయాణించే సామర్థ్యం వీటి సొంతం. ఈ బస్సులకు ఛార్జింగ్ కోసం కనీసం రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సమయం తీసుకుంటుంది.

బస్సులో డ్రైవర్ తో పాటు మొత్తం 65 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉండే ఈ బస్సుల డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. ఈ బస్సుల్ని ఓపెన్ టాప్ ఉండటం వల్ల.. నగర అందాల్ని నేరుగా చూసే వెసులుబాటు ఉన్నా.. కాలుష్య రోడ్ల మీద పరుగులు తీసే ఈ బస్సుల్లో పైన కూర్చొని ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతారా? అన్నది ప్రశ్న.

ఇక.. ఈ బస్సుల్ని పర్యాటక ప్రాంతాల్లోనూ.. హెరిటేజ్ సర్క్యూట్ లో ఉపయోగించాలని భావిస్తున్నారు. తొలుత ఈ బస్సుల్ని ఈ నెల 11న హైదరాబాద్ లో ప్రారంభం కానున్నా ఫార్ములా ఇప్రిక్స్ వేళ అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్యాంక్ బండ్.. నెక్లెస్ రోడ్.. ప్యారడైజ్.. నిజాం కాలేజీ ప్రాంతాల్లో ఈ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 11 తర్వాత పర్యాటక అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తారని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.