Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీ సారథిగా మళ్లీ ఆయనే?

By:  Tupaki Desk   |   14 Feb 2020 6:45 AM GMT
తెలంగాణ బీజేపీ సారథిగా మళ్లీ ఆయనే?
X
తెలంగాణ బీజేపీ సారథిగా మళ్లీ ఆయనకే ఛాన్స్ దక్కుతుందని బీజేపీ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది.. కొద్దిరోజులుగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తథ్యమనే ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికి బీజేపీ అధిష్టానం త్వరలోనే చెక్ పెట్టబోతుందట. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్ కే పగ్గాలు అప్పగించేందుకు సన్నహాలు చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వల్ల పార్టీకి ఒరిగేదేమీలేదని భావించిన అధిష్టానం తిరిగి ఆ పదవిలో ఆయననే కూర్చోబెట్టనుందని తెలుస్తోంది. ఈనెలఖారు వరకు దీనిపై అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

*బీజేపీలో పోటాపోటీ..
బీజేపీ లో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చాలా మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తథ్యమని ప్రచారం జరుగడంతో ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నవారు, కొత్తగా పార్టీ లో చేరిన వారు సైతం ఆ పదవి పై ఆశలు పెంచుకున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం లక్ష్మణ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ ఎన్నికైన తర్వాత తెలంగాణలో బీజేపీ చాలా పుంజుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకుంది. అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్ కేవలం మూడు ఎంపీ సీట్లను గెలుచుకుంది. పార్లమెంట్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడం లక్ష్మణ్ వల్లేనని అధిష్టానం భావిస్తోందట.. ప్రస్తుత రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగ్గా ఉంది. దీంతో ప్రస్తుతం ఆయనను మార్చడానికి పెద్దగా కారణాలు కనబడటం లేదట. దీంతో రెండోసారి కూడా లక్ష్మణ్ కే పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతగా అవసరమైతే రెండేళ్ల తర్వాత బీజేపీ రాష్ట్ర సారథి మార్పుపై ఆలోచించవచ్చని భావిస్తుంది.

* తొలుత బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం..
తొలుత బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టనున్నారు. వీరి నియామకం తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవీ కాలం ముగిసింది. అయినప్పటికీ గతేడాది కాలంగా అధిష్టానం లక్ష్మణ్ నే ఆ పదవీలో కొనసాగిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫార్మమెన్స్ చూపడంతో అధిష్టానం వద్ద ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతుంది. కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తే పార్టీ లో గందగోళ పరిస్థితి ఏర్పడవచ్చని అధిష్టానం భావిస్తుంది. దీంతో రెండోసారి కూడా బీజేపీ సారిథిగా లక్ష్మణ్ కే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈనెలఖారు వరకు బీజేపీ రాష్ట్ర సారథిగా ఆయనే తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.