Begin typing your search above and press return to search.

మూడు రాజధానుల ఏర్పాటు తధ్యం : ఏపీ గవర్నర్

By:  Tupaki Desk   |   26 Jan 2021 10:42 AM GMT
మూడు రాజధానుల ఏర్పాటు తధ్యం : ఏపీ గవర్నర్
X
ఏపీలో మూడు రాజధానుల అంశం పై ప్రకటన చేసిన సమయం నుండి చర్చ జరుగుతూనే ఉంది. ప్రభుత్వం వీలైనంత త్వరగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అయితే , విపక్షాలు మాత్రం అమరావతే ఏపీ రాజధాని అంటున్నాయి. ఇదిలా ఉంటే .. ఈ రోజు రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఏపీ గవర్నర్ ఈ మూడు రాజధానుల అంశం పై ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ వేడుకల సంద‌ర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ప్ర‌సంగించారు. అభివృద్ధి కేంద్రీక‌ర‌ణ గ‌తంలో ఇబ్బందులు సృష్టించింద‌ని పేర్కొన్నారు. దాని వ‌ల్ల ప్రాంతీయ అస‌మాన‌త‌లు త‌లెత్తాయ‌ని చెప్పారు.

అందుకే, ఏపీ ప్ర‌భుత్వం అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌ను కీల‌కంగా భావిస్తోంద‌ని చెప్పారు. ప్రాంతీయ స‌మాన‌త‌ల కోసం మూడు రాజ‌ధానులు అవ‌స‌ర‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిగా చేయాల‌ని భావిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా చేయాల‌నుకుంటున్నామ‌ని చెప్పారు. అమ‌రావ‌తి శాస‌న‌రాజ‌ధానిగా ఉంటుందని బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు.

అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి, స్వయం సాధికారికతను సాధించడానికి సంక్షేమ పథకాలను తన ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఈ దిశగా కృషి చేస్తోందని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.

ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ఇల్లు లేని నిరుపేదల కోసం ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని కిందటి నెల 25వ తేదీన ప్రారంభించిందని, దశలవారీగా 30 లక్షల మందికి పైగా లబ్దదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తోందని గవర్నర్ అన్నారు. ఇక అమ్మఒడి ద్వారా త‌ల్లుల ఖాతాల్లో రూ.13,121 కోట్లు వేసిన‌ట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2,436 జ‌బ్బుల‌కు చికిత్సలు అందిస్తున్నామ‌ని చెప్పారు. రూ.16,300 కోట్ల‌తో ప‌లు ఆసుప‌త్రుల నిర్మాణం చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం అన్ని రంగాల‌పై దృష్టి సారించిన‌ట్లు తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ‌లో క‌రోనాను సమర్థంగా ఎదుర్కొని కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప్ర‌శంస‌లు పొందిన‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతోన్న వారిని కఠినంగా శిక్షంచడానికి అవసరమైన చర్యలను తీసుకుంటోందని గవర్నర్ అన్నారు. శాంతిభద్రతలకు భగ్నం కలిగించే వారు ఎప్పటికైనా శిక్షార్హులేనని, చట్టపరంగా వారిపై కఠిన చర్యలను తీసుకుంటుందని హామీ ఇచ్చారు.