Begin typing your search above and press return to search.

ఏం జరుగనుంది?: ప్రధానికి జగన్ లేఖ.. ఢిల్లీకి కేసీఆర్

By:  Tupaki Desk   |   4 July 2021 12:30 AM
ఏం జరుగనుంది?: ప్రధానికి జగన్ లేఖ.. ఢిల్లీకి కేసీఆర్
X
కృష్ణా జలాల వివాదం ముదిరిపాకాన పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ ల నుంచి విద్యుదుత్పత్తి పేరిట నీటిని అంతా ఖాళీ చేస్తూ సముద్రం పాలు చేస్తుండడంపై ఏపీ సీఎం జగన్ అభ్యంతరం తెలిపారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీకి ఫిర్యాదు లేఖ రాశారు. ఈ క్రమంలోనే నీటి వృథాపై కేంద్రం కూడా నజర్ పెట్టినట్టు తెలుస్తోంది.

కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీలోనే తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. కృష్ణా జలాలపై అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో గళం విప్పాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే త్వరలో ఢిల్లీ వెళ్లడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

కృష్ణ జలాల్లో కేటాయింపులు లేకపోయినా.. అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించడాన్ని ఇటీవల కేబినెట్ సమావేశంలో కేసీఆర్ తీవ్రంగా నిరసించిన సంగతి తెలిసిందే. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై అవసరమైతే ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ధర్నా చేస్తామని కూడా వ్యాఖ్యానించారు.

ఈనెల 4న సీఎం జిల్లాల పర్యటనలు ఉండడంతో ఆ తర్వాతే ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారు కానుందని చెబుతున్నారు. రెండు మూడు రోజుల పాటు అక్కడే ఉండి పెండింగ్ అంశాలపై కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశం కావాలని సీఎం భావిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి.

కృష్ణా జలా వివాదంపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు పెరగడంతో రెండు రాష్ట్రాల్లోనూ ఈ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తిని నిలిపివేయించాలని.. ఆయా ప్రాజెక్టుల వద్ద కేంద్రబలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ సీఎం జగన్ బుధవారం లేఖ రాశారు. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

దీనికి కౌంటర్ గానే కేసీఆర్ నేరుగా ప్రధాని మోడీకి, కేంద్ర జలశాఖ మంత్రిని కలిసేందుకు రెడీ అవుతున్నారు. వాస్తవాలు వివరించి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళుతున్నట్టు తెలిసింది.