Begin typing your search above and press return to search.

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం ..పూర్తి వివరాలు !

By:  Tupaki Desk   |   22 Aug 2020 6:30 AM GMT
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం ..పూర్తి వివరాలు !
X
నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగల పెంట శ్రీశైలంప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ ‌లో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి విద్యుత్ తయారీ కేంద్రంలోని మొదటి యూనిట్‌లో భారీ పేలుడు సంభవించి, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం వల్ల వందల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. 900 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ పవర్ ప్లాంటులో 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్లు ఉన్నాయి. కృష్ణా నదిలో హెడ్‌ (నీటి ఇన్‌టేక్, నీటి డిశ్చార్జ్‌ పాయింట్‌ మధ్య హెచ్చుతగ్గులు) ఎక్కువగా ఉండటం వల్ల సహజంగానే 150 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇదే కారణంతో ఒక్కో యూనిట్‌ 180 మెగావాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలిసింది. అయితే పేలుడు సంభవించిన నాలుగో యూనిట్‌కు చెందిన ఆక్సిలరీ వోల్జేజీ ట్రాన్స్ ‌ఫార్మర్, ప్యానల్‌ బోర్డు మాత్రం ఒక్కసారిగా 200 మెగావాట్ల ఉత్పత్తికి వెళ్ళింది. ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్ ‌ఫార్మర్‌ పేలడానికి ఇదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని ఓ అధికారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయారీ.

అది గమనించిన డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు నాలుగో యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ఆపేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆగిపోలేదని తెలుస్తుంది. ఈ క్రమంలో పేలుళ్లు, మంటలు సంభవించి విద్యుత్‌ కేంద్రం మొత్తం చీకటిగా మారింది. అడుగు దూరంలో ఉన్న మనిషిని సైతం చూడలేని పరిస్థితి ఏర్పడిందని, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలిగిందని బయటకు వచ్చిన ఇంజనీర్లు, ఇతర అధికారులు తెలిపారు. 4వ యూనిట్‌లోని ప్యానల్‌ బోర్డులో షార్ట్‌ సర్క్యూట్‌ తో తొలుత మంటలు వ్యాపించాయి. ఆ వెంటనే ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్‌ ఫార్మర్‌ పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో విధుల్లో ఉన్న డీఈ పవన్, ఇతర ఉద్యోగులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసారు. అయితే , ఆ మంటలు అదుపులోకి రాకపోవడమే కాకుండా కేవలం 3 నిమిషాల్లోనే పవర్ ‌హౌస్ ‌లో పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన ఆరుగురు ఉద్యోగులు వెంటనే కారులో బయటకు వచ్చారు. ఎలక్ట్రికల్‌ డీఈ అంకినీడు, మరో ఉద్యోగి అతికష్టం మీద డీజిల్‌ సెట్‌ వెళ్లే సొరంగ మార్గంలో పరుగులు పెడుతూ బయటికి వచ్చి సొమ్మసిల్లిపడిపోయారు.

ఈ ప్రమాదం గురించి తెలియగానే ఉన్నతాధికారులు, ఎస్పీఈ సిబ్బంది, అధికారులు, కార్మికులు, నాన్‌ ఇంజనీర్లు ఆక్సిజన్‌ ధరించి లోపలికి వెళ్లేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ దట్టమైన పొగల కమ్ముకుపోవడం వల్ల సాధ్యపడలేదు. పెద్ద పెద్ద లైట్లు వేసుకొని వెళ్లినా దారి కనిపించలేదు. అర్ధరాత్రి 2:15 గంటలకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి పొగ కమ్ముకోవడంతో లోపలి వెళ్లలేకపోయారు. ఫైర్‌ ఇంజన్లు, అంబులెన్సులను అతికష్టం మీద లోపలికి పంపించారు. పవర్‌హౌస్‌లోని గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సిస్టమ్‌ దిగువ ప్రాంతంలో ఆయిల్‌ లీక్‌ కావడంతో మంటలు మరింత ఎగసిపడ్డాయి. అయినా అతికష్టం మీద ఫైర్‌ సిబ్బంది ప్రయత్నం కొనసాగించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎండీ ప్రభాకర్‌రావు, జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, తెలంగాణ స్టేట్‌ ఫైర్‌ సర్వీసెస్, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని పొగలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. పొగ ఎక్కువగా ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ప్రమాదం జరిగిన ప్లాంటులోకి ప్రవేశించి గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతకగా, దురదుష్టవశాత్తు వారి మృతదేహాలను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. అలాగే , ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ఉండగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో DE శ్రీనివాస్ , నలుగురు AE లు సుందర్,మోహన్ కుమార్,ఉజ్మ ఫాతిమా, వెంకట్ రావ్, సిబ్బంది రాంబాబు,కిరణ్ , మహేష్, వినేష్ తోపాటు ఇద్దరు హైదరాబాద్ నుంచి వెళ్లిన అమర్ రాజా కంపెనీ సిబ్బంది ఉన్నారు. వీరందరూ ఎస్కేప్‌ టన్నెల్‌ ద్వారా బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఫైర్ సిబ్బంది సొరంగంలో చిక్కుకున్న కొంతమందిని రక్షించారు. మిగతా వారిని బయటకు తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు, పొగ కారణంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఫైర్ సిబ్బంది అవస్థకు గురయ్యారు. మూడు సార్లు సొరంగంలోకి వెళ్లి ఆక్సిజన్ అందక వెనక్కి వచ్చారు. మంటలను అదుపు చేయటం కోసం విద్యుత్ ప్లాంట్ పూర్తిగా నిలిపివేశారు. డీఈ శ్రీనివాస్‌ కుటుంబసభ్యులకు రూ.50 లక్షలు, మిగతా మృతుల కుటుంబసభ్యులకు రూ. 25 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని , అలాగే, మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కూడా మంత్రి జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సీఐడి విచారణకు ఆదేశించారు. అదనపు డీజీపీ గోవింద్ సింగ్ ఈ ఘటనపై విచారణ చేపట్టనున్న సీఐడి బృందానికి నేతృత్వం వహించనున్నారని తెలుస్తోంది. అలాగే ,ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.