Begin typing your search above and press return to search.

ఏపీకి గుడ్‌ న్యూస్‌...ఇక విమాన ప్ర‌యాణం క‌ష్టాలుండ‌వు

By:  Tupaki Desk   |   6 Feb 2020 2:44 PM GMT
ఏపీకి గుడ్‌ న్యూస్‌...ఇక విమాన ప్ర‌యాణం క‌ష్టాలుండ‌వు
X
కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ఏం ద‌క్కనుందా...అని నిరీక్షిస్తున్న త‌రుణంలో ఓ తీపిక‌బురు వినిపించింది. రాష్ట్రంలో ఐదు విమానాశ్రయాల అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ...ఈ మేర‌కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌ దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ లోని ఐదు విమానాశ్రయాల అభివృద్ధికి రూ.651.25 కోట్లు కేటాయించామ‌ని, ఇందులో డిసెంబర్‌ 31 నాటికి రూ.414.37 కోట్లు ఖర్చయిందని ఆయ‌న వివ‌రించారు.

ఏపీలో విమానయాన సేవ‌లు మెరుగుప‌ర్చ‌డంలో భాగంగా, విజయవాడలో ప్రస్తుతం ఉన్న రన్‌వే బలోపేతం, విస్తరణ చేప‌డుతున్న‌ట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇందుకోసం రూ.145 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకూ రూ.155.02 కోట్లు ఖర్చయిందని చెప్పారు. పుణ్య‌క్షేత్ర‌మైన తిరుపతిలోని విమానాశ్రయంలో రన్‌ వే పొడిగింపు - బలోపేతానికి రూ.177 కోట్లు కేటాయించగా రూ.21 కోట్లు వ్యయమైందని చెప్పారు. విశాఖ విమానాశ్రయానికి కేటాయించిన రూ.54 కోట్లలో రూ.27 కోట్లు ఖర్చయిందని కేంద్రమంత్రి తెలిపారు. కడపలో వేర్వేరు అభివృద్ధి పనులకు రూ.94 కోట్లు కేటాయించగా రూ.33 కోట్లు ఖ‌ర్చు అయినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో రన్‌ వే పొడిగింపు, కొత్త యాప్రాన్‌ - ఫ్లడ్‌ లైట్ల నిర్మాణానికి రూ.181 కోట్లు కేటాయిస్తే రూ.176 కోట్లు ఖర్చయిందని వెల్లడించారు.

ఇక కీల‌క‌మైన హైదరాబాద్ గురించి పేర్కొన్న కేంద్రమంత్రి బేగంపేట విమానాశ్రయంలో సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చి ఆర్గనైజేషన్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.353.61 కోట్లు ఆమోదించామని, అందులో ఇప్పటివరకూ ఏమీ ఖర్చు కాలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌ దీప్ సింగ్ పూరి చెప్పారు. ఈ మేర‌కు ప‌నుల పురోగ‌తిని ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు వివ‌రించారు.