Begin typing your search above and press return to search.

అడవి వీరుడిని చంపినా న్యాయం జరగలేదా?

By:  Tupaki Desk   |   5 Feb 2023 7:30 PM IST
అడవి వీరుడిని చంపినా న్యాయం జరగలేదా?
X
అడవి కోసం ఆరాటపడి.. ప్రభుత్వం కోసం పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావును ఎవరూ మరిచిపోరు. గుత్తికోయల దాడిలో మరణించిన శ్రీనివాస రావు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన భార్యకు ఉద్యోగంతో పాటు నెలనెల పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో 500 గజాల స్థలాన్ని కేటాయిస్తూ అందుకు సంబంధించిన పత్రాలు స్వయంగా కలెక్టర్ అందించారు. అయితే ఈ స్థలం ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ స్థలంలోని కంచెను కొందరు తొలగించారు. ఇది వివాదంలో ఉందని, వారికి వేరే చోట స్థలం కేటాయిస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో అడవి కోసం ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు కుటుంబానికి సైతం న్యాయం జరగడం లేదా..? అని చర్చించుకుంటున్నారు.

తెలంగాణలో భూముల విలువలు పెరిగిపోవడంతో ఖాళీ స్థలాలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఇటీవల భూ వివాదాలు పెరిగిపోయాయి. అయితే ప్రభుత్వం అందించిన స్థలాన్ని సైతం కొందరు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు కుటుంబానికి ఖమ్మం జిల్లా కేంద్రంలో బుర్హన్ పురం రెవెన్యూ సర్వే నెంబర్ 93లో 500 గజాల స్థలాన్ని కేటాయించింది. ఇది బస్టాండ్ పక్కనే ఉండడంతో డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఈ స్థలాన్ని కొందరు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ స్థలంలోని కంచెను తొలగించడంతో శ్రీనివాస రావు కుటుంబం షాక్ కు గురైంది.

తమకు ఈ స్థలం ప్రభుత్వం కేటాయించిందని అడగ్గా..వారికి వేరే చోట కేటాయిస్తారని అంటున్నారట. అయితే స్థలం పత్రాలు స్వయంగా కలెక్టర్ వీసీ గౌతమ్ కేటాయించారని వారు వాపోతున్నారు. స్థలానికి సంబంధించిన పత్రాలతో పాటు మ్యాపు కూడా అందించారు. కానీ ఇప్పడు ఆ స్థలం వివాదాల్లో ఉందని అంటున్నారు. దీనిని ఎన్నెస్పీ ఉద్యోగులు తమకు కేటాయించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అంటున్నారు. మరి స్వయంగా కలెక్టర్ ఈ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ఈ స్థలం వివాదంలో ఉందని తెలియలేదా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకునేందుకే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. శ్రీనివాసరావు కుటుంబానికి కేటాయించిన స్థలం బస్టాండ్ పక్కనే ఉండడంతో దీనికి విపరీత డిమాండ్ ఉంది. అందువల్ల దీనిని కొందరు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి ఇతరచోట స్థలం ఇప్పించేలా ప్లాన్ వేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయం బయటికి పొక్కడంతో బాధిత కుటుంబానికి అండగా కొందరు వాదిస్తున్నారు. మరి చివరికి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.