Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కోరిక తీర్చుకున్న ‘గాలి’

By:  Tupaki Desk   |   23 May 2023 7:00 AM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కోరిక తీర్చుకున్న ‘గాలి’
X
కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత కర్ణాటకలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. విధాన సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో తాత్కాలిక స్పీకర్‌ ఆర్‌.వి.దేశ్‌ పాండే ప్రమాణ స్వీకారం చేయించే తంతు ప్రారంభమైంది. ఈ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగనుంది. గెలిచిన వారందరి ప్రమాణ స్వీకారాలు పూర్తయిన తరువాత అసెంబ్లీలో వివిధ అంశాలపై చర్చ మొదలవుతుంది. అయితే ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వారిలో ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంది. దాదాపు పన్నేండు సంవత్సరాల తరువాత మైనింక్‌ కింగ్‌ గాలి జనార్దన్‌రెడ్డి విధాన సభలో అడుగు పెట్టారు.

పుష్కర కాలం తరువాత కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్ధన్‌రెడ్డి అసెంబ్లీకి రావడం అందరినీ ఆకర్షించారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూ నవ్వుతూ అందరినీ పలకరించిన గాలి జనార్దన్‌రెడ్డి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి ఆత్మీయంగా మాట్లాడారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ అంతేకాలం పాటు ఎమ్మెల్యే పదవికి దూరమైన గాలి జనార్దన్‌రెడ్డి అసెంబ్లీలోకి రావడాన్ని సభ సభ్యులతో పాటు మీడియా ఆసక్తిగా తిలకించింది.

విధాన సభలోకి రావడం కంటే ముందు మీడియాతో మాట్లాడిన గాలి జనార్దన్‌రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చాలాకాలం నుండి ఈ రోజు కోసం ఎదురుచూశానని అన్నారు. ఇన్నేళ్లకు తన ఆశ నెరవేరిందని చెప్పారు. తన మీద నమ్మకి రావడం కటకంతో ఓట్లు వేసిన గంగావతి ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని అన్నారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.

గాలి జనార్దన్‌రెడ్డి కొన్ని కారణాల రీత్యా తాను బిజెపికి దూరమైన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన కల్యాణ కర్ణాటక రాజ్య ప్రగతి పార్టీ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో తనతో పాటు తమ నాయకులను పోటీలో నిలిపినప్పటికీ గాలి ఒక్కరే గంగావతి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే రాష్ట్ర ప్రజలు తమ పార్టీని, తమ పార్టీ నాయకులను ఆదరించారని, ఇప్పుడు తాను ఒక్కడినే అసెంబ్లీలో అడుగుపెడుతున్నానని వివరించారు. వచ్చే ఎన్నికల్లో చాలా సీట్లను తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.