Begin typing your search above and press return to search.

ముడియంకు ఎమ్మెల్సీ.. కండిష‌న్ పెట్టిన చంద్ర‌బాబు..!

By:  Tupaki Desk   |   9 July 2023 1:50 PM GMT
ముడియంకు ఎమ్మెల్సీ.. కండిష‌న్ పెట్టిన చంద్ర‌బాబు..!
X
టీడీపీ నాయ‌కుడు, పోల‌వ‌రం మాజీ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస‌రావుకు పార్టీ అధినేత చంద్ర‌బాబు ఎమ్మెల్సీ టికెట్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. త‌ప్ప‌కుండా మండ‌లికి పంపిస్తామ‌ని ఆయ‌న‌కు హామీ ఇచ్చిన‌ట్టు ఎన్టీఆర్ భ‌వ‌న్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. అయితే.. ఈసంద‌ర్భంగా ముడియంకు కొన్ని కండిష‌న్లు పెట్టార‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్న చంద్ర‌బాబు.. వారితో ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో చ‌ర్చిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంపై వ‌రుస‌గా నాలుగు రోజులు చ‌ర్చించారు. ఈ టికెట్‌పై ఉత్కంఠ నెల‌కొన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు దీనిని నాలుగు రోజుల పాటు చ‌ర్చించ‌డం గ‌మ‌నార్హం. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల నివేదిక‌లు.. ప‌రిస్థితుల‌ను.. ప్ర‌జ‌ల్లో ఉన్న జోష్ వంటివాటిని చంద్ర‌బాబు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుత టీడీపీ ఇంచార్జ్ బుర‌గం శ్రీనివాస‌రావుకు అసెంబ్లీ టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అయితే.. ఈ టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్న ముడియం శ్రీనివాస‌రావును బుజ్జ‌గించిన టీడీపీ అధినేత‌.. పార్టీ అధికారంలోకి రాగానే.. ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామ‌ని.. గుర్తు పెట్టుకుంటామ‌ని హామీ ఇచ్చారు. అయితే.. ఈ క్ర‌మంలో ముడియం.. బుర‌గం గెలుపున‌కు కృషి చేయాల‌ని.. క్షేత్ర‌స్థాయిలో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి.. పార్టీని బ‌లోపేతం చేయాల‌ని.. తాను అన్ని రిపోర్టులు మ‌ళ్లీ తెప్పించుకుంటాన‌ని.. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారికి గుర్తింపు ఉంటుంద‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు.

ఇక‌, టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయిన బుర‌గం శ్రీనివాస‌రావుకు కూడా చంద్ర‌బాబు కొన్ని కండిష‌న్లు పెట్టిన‌ట్టు ఎన్టీఆర్ భ‌వ‌న్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. అంద‌రినీ కలుపుకొని పోవాల‌ని.. ఎక్క‌డా విభేదాలు రాకుండా చూసుకోవాల‌ని.. ఆధిప‌త్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్ద‌ని.. టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌నే ధోర‌ణి అస‌లే వ‌ద్ద‌ని.. ఎన్నిక‌ల నాటికి గ్రాఫ్ పెర‌గాల‌ని.. చంద్ర‌బాబు సూచించిన‌ట్టు తెలిసింది. మొత్తానికి పోల‌వ‌రంలో నెల‌కొన్న క‌ల‌వ‌రానికి చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో చెక్ పెట్ట‌డం గ‌మ‌నార్హం.