Begin typing your search above and press return to search.

'జై అమరావతి' అంటే అంత పెద్ద శిక్ష వేస్తారా?

By:  Tupaki Desk   |   2 Feb 2020 4:27 AM GMT
జై అమరావతి అంటే అంత పెద్ద శిక్ష వేస్తారా?
X
షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఏపీలోని అన్ని ప్రాంతాల్ని సమానంగా డెవలప్ చేసేందుకు మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించటం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమేర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజధాని ఆశతో తమకు చెందిన 33 వేల ఎకరాల భూమిని గత ప్రభుత్వానికి ఇచ్చేసిన రైతులు మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అదే సమయంలో అటు రాయలసీమలో కానీ.. ఇటు ఉత్తరాంధ్రలో కానీ ఎలాంటి వ్యతిరేకత కనిపించని పరిస్థితి. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇలాంటివేళ.. అమరావతికి దగ్గర్లో ఉండే నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థుల్ని వర్సిటీ తాజాగా సస్పెండ్ చేసింది.

ఎందుకిలా? అంటారా? సస్పెన్షన్ కు వారు చేసిన తప్పు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. జై అమరావతి అన్న నినాదాలు చేసినందుకే సస్పెండ్ చేసినట్లుగా చెబుతున్నారు. జై అమరావతి నినాదాలు చేసినందుకు నలుగురు విద్యార్థుల (అశీర్వాదం.. నవీన్.. ఏడు కొండలు.. రాజు) ను సస్పెండ్ చేశారు. వెంటనే వారు వర్సిటీలోని హాస్టల్ రూంను ఖాళీ చేయాలని ఆదేశించారు. అంతేకాదు.. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలంటూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

ఉమ్మడి రాష్ట్రంలో జై తెలంగాణ అన్నంతనే.. ఇలాంటి చర్యలు తీసుకుంటే ఏమయ్యేది? అయినా.. ఇప్పటికే ఉన్న రాజధానిని కొనసాగించాలన్న మాట విద్యార్థుల నోటి నుంచి రావటం తప్పైతే కాదు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది. మరీ.. వ్యవహారంపై రానున్న రోజల్లో ఎలాంటి రగడ చోటు చేసుకోనున్నదో చూడాలి.