Begin typing your search above and press return to search.

వంశీని వదులుకోమంటూనే.. 'గద్దె' ను సిద్ధం చేస్తున్నారే

By:  Tupaki Desk   |   28 Oct 2019 4:45 PM GMT
వంశీని వదులుకోమంటూనే.. గద్దె ను సిద్ధం చేస్తున్నారే
X
గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన యువ నేత వల్లభనేని వంశీ మోహన్ పై టీడీపీ ఆశలు వదిలేసుకున్నట్టుగానే కనిపిస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా టీడీపీ నుంచి దక్కిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తూ వంశీ తీసుకున్న సంచలన నిర్ణయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చాలా వేగంగానే స్పందించారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని - ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులపై కలిసి పోరాటం చేస్తామని కూడా చంద్రబాబు... వంశీకి చెప్పారు. అంతేకాకుండా వెనువెంటనే విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నానితో పాటు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను వంశీ దగ్గరకు పంపి... రాజీనామాను వెనక్కు తీసుకునేలా వంశీపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వంశీని అంత ఈజీగా వదులుకోమంటూ టీడీపీ ఆసక్తికర ప్రకటన చేసింది. ఇది నాణేనికి ఓ వైపేనన్న వాదన వినిపిస్తోంది. వంశీపై ఇప్పటికే ఆశలు వదిలేసుకున్న టీడీపీ... వంశీ రాజీనామాతో ఉప ఎన్నికలు ఖాయమని - అందులో గన్నవరం స్థానం నుంచి పార్టీ సీనియర్ నేత - విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సతీమణి - కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధను బరిలోకి దింపేందుకు రంగం సిధ్దం చేస్తున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.

వల్లభనేని వంశీ మోహన్ టీడీపీ నేతగా కంటే కూడా గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఆప్తుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో మొత్తం 16 సీట్లుంటే... వాటిలో వైసీపీ 14 సీట్లను కైవసం చేసుకోగా గద్దె రామ్మోహన్ రావుతో పాటు వంశీ మాత్రమే టీడీపీ తరఫున గెలిచారు. జనంలో మంచి నేతగా గుర్తింపు పొందిన క్రమంలోనే అటు గద్దెతో పాటు ఇటు వంశీ కూడా విజయం సాధించారని ఇప్పటికే లెక్కలేనన్ని విశ్లేషణలు వినిపించాయి. వైసీపీ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని నిలబడ్డ క్రమంలోనే వంశీని వదులుకోమంటూ టీడీపీ ప్రకటనలు గుప్పిస్తున్నా... తెర వెనుక మాత్రం గన్నవరం స్థానానికి బైపోల్స్ తప్పవని - అదే జరిగితే... గద్దె అనురాధను బరిలోకి దింపాలని ఇప్పటికే టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చేసిందన్న వార్తలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ప్రత్యేకించి విజయవాడ నగరంలో - మరీ ప్రత్యేకించి గన్నవరంలో భారీ అనుచర గణం ఉన్న గద్దెను బరిలోకి దింపితేనే ఫలితం ఉంటుందన్న కోణంలో టీడీపీ రచిస్తున్న వ్యూహాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఓ వైపు వంశీని వదులుకోబోమని ప్రకటనలు గుప్పిస్తూనే... గవన్నవరం ఉప ఎన్నికలకు పార్టీ అభ్యర్థిగా గద్దె అనురాధను సిద్ధం చేస్తున్న టీడీపీ వ్యవహార సరళిపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి. వంశీని వదులుకోబోమని ప్రకటన చేయడం ఎందుకు? ఆ వెంటనే గద్దె అనురాధను ఎన్నికలకు సిద్ధం చేయడం ఎందుకు? అన్న కోణంలో సొంత పార్టీ కార్యకర్తల నుంచే టీడీపీకి ప్రశ్నలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. మొత్తం ఈ విశ్లేషణలను చూస్తుంటే... వంశీపై టీడీపీ దాదాపుగా ఆశలు వదిలేసుకున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. వంశీపై ఆశలే ఉంటే... ఆయన నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాకుండానే... గన్నవరం ఉప ఎన్నికల అభ్యర్థిగా అప్పుడే గద్దె అనురాధ పేరును ఎందుకు ఖరారు చేసే దిశగా సాగుతారన్న దిశగానూ విశ్లేషణలు సాగుతున్నాయి. వంశీపై ఆశలు వదిలేసుకుని రంగంలోకి దింపుతున్న గద్దె టీడీపీకి ఏ మేర ఉపయోగపడతారో చూడాలి.