Begin typing your search above and press return to search.

ఇంటింటికి తిరిగి వైసీపీకి ఓట్లు వేయించాడు.. అయినా తిప్పలు తప్పట్లేదు

By:  Tupaki Desk   |   8 March 2023 9:48 AM GMT
ఇంటింటికి తిరిగి వైసీపీకి ఓట్లు వేయించాడు.. అయినా తిప్పలు తప్పట్లేదు
X
బయటోళ్లు అయిపోయారు. ఇప్పుడు ఇంట్లో వాళ్లే టార్గెట్ అయ్యారన్నట్లుగా ఏపీలో పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతల తీరు ఎలా ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకాలం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ గా చేసుకున్న వారి తీరును పలువురు ప్రశ్నిస్తున్నా.. కొందరు మాత్రం సమర్థించే పరిస్థితి. ఇలాంటి వేళ.. అందుకు భిన్నంగా సొంత పార్టీకి చెందిన వ్యక్తినే ఇబ్బందులకుగురి చేస్తున్న వైనం చూస్తే మాత్రం అయ్యో అనుకోకుండా ఉండలేం.

సార్వత్రిక ఎన్నికల వేళ.. కావాలి జగన్.. రావాలి జగన్ అంటూ నినాదాలు చేసి.. ఇంటింటికి తిరిగి వైసీపీకి ఓట్లు వేయించిన అరివీర భయంకర వైసీపీ డైహార్డ్ ఫ్యాన్ గాడిపర్తి నరసింహారావు. పల్నాడు జిల్లా అమరావతి మండలం ముత్తాయపాలానికి చెందిన ఆయనకు.. ఏది ఏమైనా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్న పట్టుదల ఆయనకు ఎక్కువ. వయసు మీద పడినా.. తాను కోరుకున్నట్లుగా జగన్ అధికారంలోకి వస్తే పరిస్థితుల్లో మార్పులు వస్తాయని నమ్మిన ఆయన.. ఇంటింటికి తిరిగి పార్టీ తరఫున ప్రచారం చేశాడు. ప్రజల చేత ఓట్లు వేయించాడు.

అలాంటి గాడిపర్తి నరసింహారావుకు పెద్ద కష్టమే వచ్చింది.  ఆయన పొలం మీద నుంచి ఇసుక లారీలు పెద్ద ఎత్తున వెళుతున్న వైంతో పంటలకు మహా ఇబ్బందిగా మారింది. దీంతో.. ఆయన ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు ఫిర్యాదు చేశారు. తన భూమి మీదుగా వెళుతున్న వందలాది లారీల కారణంగా ఇబ్బందిగా ఉందని మొరపెట్టుకున్నాడు. అయినా.. పట్టించుకోని పరిస్థితి. ఇసుక లారీల కాఱణంగా తన భూమికి బాగా నష్టం వాటిల్లుతుందన్న మాట చెప్పినా వినిపించుకోలేదు.

ఎమ్మెల్యే లైట్ తీసుకోవటంతో కలెక్టర్.. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ రియాక్టు అయ్యింది లేదు. రోజుకు 300 లారీల వరకు ఊరి మీదుగా వెళుతున్నాయని.. ఇసుక లారీల దెబ్బకు ఊరి ప్రశాంతత పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు.

ఇలాంటి వేళ.. గాడిపర్తి నరసింహారావు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. తానెంత వేడుకున్నా వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావుపట్టించుకోకపోవటం.. అధికారులు లైట్ తీసుకోవటంతో ఆవేదన చెందిన ఆయన.. తాజాగా తన భూమి మధ్యలో నిలబడి.. లారీలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీంతో.. ఈ వ్యవహారం సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో షేరుకావటంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. దీంతో రియాక్టు అయిన అధికారులు.. అసలు ఆ భూమి నరసింహారావుదా? కాదా? అంటూ ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా..అధికార పార్టీ తరఫున పని చేసిన తనకు కూడా ఇలాంటి కష్టం ఏమిటంటూ ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి వేళ.. కావాలి జగన్.. రావాలి జగన్ మాత్రమే కాదు.. చూడాలి జగన్ అన్న మాటను ఇప్పుడు పెద్ద ఎత్తున అనాల్సిన అవసరం ఏర్పడిందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.