Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ధోనీపై ప‌డ్డ గంభీర్

By:  Tupaki Desk   |   15 July 2020 4:15 AM GMT
మ‌ళ్లీ ధోనీపై ప‌డ్డ గంభీర్
X
భార‌త క్రికెట్ జ‌ట్టు 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు గెల‌వ‌డంలో మాజీ ఓపెన‌ర్ గౌత‌మ్ గంభీర్‌ది కీల‌క పాత్ర‌. ఆ రెండు ఫైన‌ల్స్‌లో టాప్ స్కోర‌ర్ అత‌నే. అలాగే 2010లో భార‌త జ‌ట్టు టెస్టుల్లో నంబ‌ర్ వ‌న్ కావ‌డంలోనూ అత‌డి పాత్ర కీల‌కం. అయితే అత‌డికి రావాల్సినంత పేరు రాలేద‌న్న‌ది వాస్త‌వం. అదే స‌మ‌యంలో ఆ విజ‌యాలు, ఘ‌న‌త‌ల తాలూకు క్రెడిట్ ఎక్కువ‌గా కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి వెళ్తుంటుంది. ముఖ్యంగా 2011 క‌ప్ ఫైన‌ల్లో గంభీర్ టాప్‌స్కోర‌ర్ కాగా.. అత‌డి వెనుక వ‌చ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ధోనీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌‌క్కింది. ఇందుకేనేమో ధోనీ అంటే గంభీర్‌కు అస్స‌లు గిట్ట‌దు. త‌ర‌చుగా అతడి మీద విమ‌ర్శ‌లు చేస్తుంటాడు. అత‌డి విలువ త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు.

తాజాగా అత‌ను మ‌రోసారి ధోనీని టార్గెట్ చేశాడు. ఒక‌ప్పటి కెప్టెన్ గంగూలీ లాగా భార‌త క్రికెట్‌కు మంచి ఆట‌గాళ్ల‌ను ధోనీ ఇవ్వ‌లేక‌పోయాడ‌ని అత‌ను వ్యాఖ్యానించాడు. గంగూలీ సారథ్యంలో ఎంతో మంది నాణ్యమైన క్రికెటర్లు ప్రపంచానికి పరిచయం అయ్యారని, కానీ ధోని కెప్టెన్‌గా ఉండ‌గా అలా జరగలేదని అన్నాడు గంభీర్‌. ధోనీకి గంగూలీ అందించిన‌ట్లుగా.. ధోనీ త‌న త‌ర్వాతి కెప్టెన్ కోహ్లీకి మంచి ఆట‌గాళ్ల‌ను అందించ‌లేద‌ని గంభీర్ వ్యాఖ్యానించాడు. ధోని నాయకత్వంలో కోహ్లి, రోహిత్‌, బూమ్రా లాంటి కొంద‌రు నాణ్య‌మైన ఆట‌గాళ్లు వ‌చ్చార‌ని.. కానీ గంగూలీ హ‌యాంలో యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, జహీర్‌ఖాన్‌ లాంటి అత్యుత్తమ క్రికెటర్లు వెలుగులోకి వ‌చ్చార‌ని గంభీర్ చెప్పాడు. ఐతే ఆ స‌మ‌యానికి వ‌చ్చిన ఆట‌గాళ్ల‌లోంచి ఉత్త‌మ‌మైన వాళ్ల‌ను కెప్టెన్ ఎంచుకోగ‌ల‌డు కానీ.. ఈ విష‌యంలో ధోనీని త‌ప్పుబ‌ట్ట‌డానికి ఏముందో గంభీర్‌కే తెలియాలి.