Begin typing your search above and press return to search.

మనమడి పూజ అంటే మాటలా? కేసీఆర్ సైతం సీన్లోకి వచ్చేశారు

By:  Tupaki Desk   |   26 Aug 2020 11:30 AM GMT
మనమడి పూజ అంటే మాటలా? కేసీఆర్ సైతం సీన్లోకి వచ్చేశారు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు రోటీన్ కు భిన్నమని చెప్పాలి. ఆయన ఏ విషయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారో.. దేనికి ఇవ్వరో అస్సలు అర్థం కాదు. ఊహించని రీతిలో ఆయన నిర్ణయాలు ఉంటాయి. కొన్ని కీలక కార్యక్రమాలకు సైతం హాజరు కాని ఆయన.. అందుకు భిన్నంగా చాలా చిన్న అంశాలకు అపరిమితమైన ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒకటి ప్రగతిభవన్ లో చోటు చేసుకుంది.

సీఎం కేసీఆర్ మాదిరే ఆయన మనమడు హిమాన్షుకు దైవభక్తి ఎక్కువ. పూజలు.. పునస్కారాలు చేస్తుంటారు. వినాయకచవితి వచ్చిందంటే చాలు.. ఖైరతాబాద్ గణేశుడి వద్దకు వెళ్లి దర్శనం చేసుకోవటం అతనికి అలవాటు. కరోనా నేపథ్యంలో.. ప్రగతిభవన్ లోనూ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించాడు. మనమడు పూజ చేస్తుంటే.. తాత సీఎం అయితే మాత్రం.. పూజకు వెళ్లకుండా ఉంటారా?

అందులోని అథ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి తన అసలైన వారసుడిగా హిమాన్షును కేసీఆర్ భావిస్తారని చెబుతారు. ఈ పూజలో పాల్గొనటం కోసం ఆయన ఫామ్ హౌస్ నుంచి వచ్చారని చెబుతారు. హిమాన్షు పూజ చేస్తుంటే.. సీఎం కేసీఆర్.. ఆయన సతీమణి.. కోడలు శైలిమ.. ఎంపీ సంతోష్ తోపాటు.. పలువురు భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక కీలకమైన వ్యక్తి మిస్ అయినట్లుగా కనిపించక మానదు. హిమాన్షు తండ్రి కమ్ మంత్రి కేటీఆర్ మాత్రం ఈ పూజ దగ్గర కనిపించకపోవటం గమనార్హం. తండ్రికి.. కొడుక్కి భిన్నంగా మంత్రి కేటీఆర్ కు పూజలు.. అధ్యాత్మిక కార్యక్రమాల మీద పెద్ద ఆసక్తి ఉండదని చెబుతారు. ఈ కారణంతోనే ఆయన వచ్చి ఉండరన్న మాట వినిపిస్తోంది.