Begin typing your search above and press return to search.

‘గీతం’ తదుపరి కూల్చివేతలు వద్దు: హైకోర్టు

By:  Tupaki Desk   |   25 Oct 2020 6:45 AM GMT
‘గీతం’ తదుపరి కూల్చివేతలు వద్దు: హైకోర్టు
X
ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించారంటూ విశాఖ గీతం విశ్వవిద్యాలయంలోని కొన్ని కట్టడాలను జీవీఎంసీ అధికారులు ఇటీవల కూల్చివేయడం సంచలనమైంది. యూనివర్సిటీ ప్రధాన ద్వారం, ప్రహరీ గోడ కొంతభాగం, సెక్యూరిటీ గదులను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. జీవీఎంసీ అధికారులు జేసీబీ, బుల్ డోజర్లతో కూల్చివేత చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు.

గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత నేపథ్యంలో బీచ్ రోడ్డు మీదుగా విశ్వవిద్యాలయానికి వెళ్లే మార్గాన్ని అధికారులు రెండు వైపులా మూసివేశారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని గీతం యాజమాన్యం ఆరోపిస్తోంది.

ఈ క్రమంలోనే విశాఖ గీతం యూనివర్సిటీలో కట్టడాల విషయంలో సోమవారం వరకు ఎలాంటి కూల్చివేతలు వద్దని తాజాగా అధికారులను హైకోర్టు ఆదేశించింది. తమ కట్టడాలను అధికారులు హడావుడిగా కూల్చేస్తున్నారని గీతం యూనివర్సిటీ వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు.. దీనిపై ఇవాళ పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామంది.

ఇక అటు ప్రభుత్వ భూమి స్వాధీనంలో ఉన్నట్లు గుర్తించి ఐదు నెలల కిందే మార్కింగ్ ఇచ్చామని ఆర్డీవో తెలిపారు. దీంతో విచారణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రస్తుతానికి గీతం యూనివర్సిటీ కూల్చివేతలను ఆపాలని ఆదేశించింది.

సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ విశాఖ ఎంపీగా పోటీచేసిన శ్రీభరత్ గీతం వర్సిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇది రాజకీయ రంగు పులుముకుంది.