Begin typing your search above and press return to search.

ఆ వైసీపీ ఎంపీ కాదు కాదంటున్నా గాసిప్స్‌ ఆగడం లేదే!

By:  Tupaki Desk   |   9 Feb 2023 1:00 PM GMT
ఆ వైసీపీ ఎంపీ కాదు కాదంటున్నా గాసిప్స్‌ ఆగడం లేదే!
X
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్ద లక్ష్యాన్నే పెట్టుకున్నారు. అయితే అదంత తేలికగా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీలో అసమ్మతి రంగంగానే కనిపిస్తోందని చెబుతున్నారు. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే కాకుండా లోక్‌ సభా నియోజకవర్గాల పరిధిలో ఎంపీలకు సైతం ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు.

పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని గతంలోనే వార్తలు వచ్చాయి. నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చిలకలూరిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు మొదటి నుంచీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని టాక్‌ నడుస్తోంది.

తన నియోజకవర్గంలో పరిధిలో ఎంపీ లావుకు ఏం పని అని రజిని, అలాగే తన లోక్‌సభా నియోజకవర్గంలో ఆమెకు పని ఏంటని లావు ఒకరికొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారని టాక్‌ నడించింది. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్‌ గతంలోనే వీరిద్దరికీ క్లాస్‌ తీసుకున్నారని ప్రచారం కూడా జరిగింది.

సీఎంతో క్లాస్‌ అయ్యాక కూడా మరోమారు ఎంపీకి, మంత్రికి మధ్య విభేదాలు బయటపడ్డాయని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోగల లింగంగుంట్లలో 200 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి విడదల రజని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరూ హాజరయ్యారు. అయితే మంత్రి తన ప్రసంగం ముగియగానే ఎంపీని పట్టించుకోకుండా వెళ్లిపోయారని చెబుతున్నారు.

దీంతో లావు శ్రీకృష్ణ్ణదేవరాయలు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు మంత్రి విడదల రజిని తాను మంత్రిగా రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని.. తనను తమ నియోజకవర్గాల్లో పర్యటించవద్దని అంటే ఎలా అని నిలదీస్తున్నట్టు సమాచారం.

అలాగే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి సైతం ఇటీవల తన నియోజకవర్గంలో ఎంపీ లావు పెత్తనం ఎక్కువగా ఉందని.. ఎమ్మెల్యేను అయిన తనను కనీసం పట్టించుకోకుండా ఎంపీ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపైనా మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇటీవల కేంద్రం నుంచి నిధులు వచ్చాయని.. వీటిని పల్నాడు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి వెచ్చించే విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు సామాజికవర్గ కోణంలోనూ ఇద్దరు నేతల మధ్య విభేదాలున్నాయని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాసు వచ్చే ఎన్నికల్లో ఎంపీకి టికెట్‌ ఇవ్వొద్దని వైఎస్సార్సీపీ అధిష్టానానికి లేఖ రాసినట్టు గాసిప్స్‌ వినిపించాయి.

ప్రస్తుతం నరసరావుపేట నుంచి వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. విజ్ఞాన్‌ విద్యా సంస్థలకు లావు వైస్‌ చైర్మన్‌ గా ఉన్నారు.

ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని టాక్‌ నడుస్తోంది. అంతేకాకుండా ఈసారి లావు శ్రీకృష్ణదేవరాయలకు వైఎస్సార్సీపీ తరఫున సీటు దక్కే అవకాశాలు లేవంటున్నారు. నియోజకవర్గ పరిధిలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలే కారణమని ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో వైఎస్సార్సీపీ తరఫున ప్రస్తుతం బందరు ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. గతంలో ఒకసారి బాలశౌరి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అదేవిధంగా గతంలో టీడీపీ ఎంపీగా ఒకసారి గెలిచి ప్రస్తుతం వైసీపీలో ఉన్న మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి నరసరావుపేట ఎంపీగా వైసీపీ తరఫున బరిలో ఉంటారని అంటున్నారు.

మరోవైపు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ ముఖ్యులతో టచ్‌ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. దీనిపై వైసీపీ అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉందనే టాక్‌ నడిచింది. అయితే ఈ వార్తలను ఎంపీ లావు ఖండించారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను వైసీపీ నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. తానంటే గిట్టనివారు ఈ ప్రచారం చేస్తున్నారని లావు ఆరోపించారు.

వాస్తవానికి పార్లమెంటులో ఏపీ సమస్యలపై గళమెత్తే ఎంపీల్లో ఒకరిగా లావు శ్రీకృష్ణదేవరాయలకు పేరుంది. అందులోనూ బాగా చదువుకుని ఉండటం, ఇంగ్లిష్‌ పై అసాధారణ పట్టు, యువకుడు కావడంతో ఆయన పార్లమెంటు సమావేశాలు జరిగిన ప్రతిసారీ చురుకుగా ఉంటున్నారు. ఏపీకి కేంద్రం నెరవేర్చాల్సిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

అయితే నరసరావుపేట లోక్‌ సభా నియోజకవర్గంలో తన సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే ఎంపీ లావుకు అభిప్రాయభేదాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో టచ్‌ లో ఉన్నారని.. ఆయన కూడా పార్టీ మారడమే ఖాయమేనని అంటున్నారు. ఎంపీ ఈ వార్తలను కాదు కాదంటున్నా గాసిప్స్‌ మాత్రం ఆగకపోవడం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.