Begin typing your search above and press return to search.

అంత పెద్ద తెలుగోడి అంత్యక్రియలు అంత దయనీయంగా జరిగాయట!

By:  Tupaki Desk   |   12 April 2020 5:53 AM GMT
అంత పెద్ద తెలుగోడి అంత్యక్రియలు అంత దయనీయంగా జరిగాయట!
X
కోట్లకు కొదవలేదు. పేరు ప్రఖ్యాతులు తక్కువేం కాదు. అన్ని ఉన్న ఆ తెలుగోడి ప్రాణాల్ని తీసేసింది మాయదారి కరోనా. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించటమే కాదు.. అమెరికాలోని తెలుగువారికి తలలో నాలుకలా ఉండే తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి అంత్యక్రియలు జరిగిన తీరు దయనీయంగా ఉండటమేకాదు.. ఈ విషయం తెలిసిన వారంతా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ప్రపంచంలో మరే దేశంలో లేనంత దారుణ పరిస్థితికి అమెరికా వెళ్లిపోవటం తెలిసిందే.

కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలం కావటమే కాదు.. చిగురుటాకులా వణికిపోతోంది. రోజు గడిచే కొద్దీ పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవటం.. అమెరికా ప్రజలు పిట్టల మాదిరి రాలిపోతున్నారు. దీంతో.. రికార్డు స్థాయిలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో 5.21 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శనివారం నాటికి 20వేల మందికి పైగా అమెరికన్లు బలయ్యారు. ఒక్క శనివారమే చూసుకుంటే కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు 35 వేలుగా కాగా.. కరోనా కారణంగా మరణించిన వారు రెండు వేలకు పైనే కావటం గమనార్హం.

ఇప్పటివరకూ కరోనా కారణంగా ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇటలీలో చోటు చేసుకుంటే.. తాజాగా అమెరికా ఆ రికార్డును తుడిపేసింది. తమ ప్రజల్ని కాపాడేందుకు అమెరికా సర్కారు రాత్రనక.. పగలనక శ్రమిస్తోందని.. ఇక కరోనా పరిష్కారం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించిన ట్రంప్.. 50 రాష్ట్రాల్ని అతి పెద్ద ముప్పు ఉన్నవిగా ప్రకటించారు. ఆయా రాష్ట్రాల వారు ఇంటికే పరిమితం కావాలన్నారు.

ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా అమెరికాలో మరణించిన వారిలో భారతీయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తాజాగా న్యూజెర్సీలో పేరు ప్రఖ్యాతులున్న తెలుగువారిలో మారేపల్లి హన్మంతరావు ఒకరు. ఎడిసన్ లో సన్నోవా అనలటికల్ సంస్థ సీఈవో వ్యవహరిస్తున్న మారేపల్లి హన్మంతరావు తాజాగా కరోనాకు బలయ్యారు. ఏపీకి చెందిన ఆయన ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. తెలుగు ప్రజలకు తలలో నాలుకలా ఉండే ఆయన అంత్యక్రియలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో జరిగాయి. అంత్యక్రియలకు కేవలం తొమ్మిది మందికే అనుమతించటంతో.. ఆయన అంతిమ సంస్కారాల్ని ఆన్ లైన్ లో వీక్షిస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. తెలుగు ప్రముఖుడు అత్యంత దయనీయ స్థితిలో అంత్యక్రియలు జరగటంపై అమెరికాలోని తెలుగువారు తీవ్రమైన వేదనకు గురవుతున్నారు.