Begin typing your search above and press return to search.

హైదరాబాద్​లో ‘హవాలా’.. బయటపడ్డ నోట్ల కట్టలు

By:  Tupaki Desk   |   19 Nov 2020 10:45 AM IST
హైదరాబాద్​లో ‘హవాలా’.. బయటపడ్డ నోట్ల కట్టలు
X
జీహెచ్​ఎంసీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్​లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భారీగా హవాలా డబ్బును హైదరాబాద్​కు తీసుకొచ్చేందుకు కొందరు స్కెచ్​ వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ భారీగా డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. రెండు సార్లు బీజేపీ అభ్యర్థికి చెందిన డబ్బులను పోలీసులు పట్టుకున్నారు. అయితే పోలీసులు టీఆర్​ఎస్​కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. అధికార పార్టీ చెప్పినట్టు వింటున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. రఘునందన్​ రావు మామ ఇంట్లో దొరికిన డబ్బును పోలీసులే తీసుకొచ్చి పెట్టారని కూడా బీజేపీ నేతలు ఆరోపించారు.

ఈ క్రమంలో జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. నిన్న హైదరాబాద్ లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేరు వేరు హవాలా కేసుల్లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ కి 34 లక్షల నగదు పట్టుబడింది. సుల్తాన్ బజార్ లో సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా డబ్బు తరలిస్తున్న ఇద్దరు రాజస్థాన్ కు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేశారు.వీరి వద్ద నుంచి రూ.13 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డబ్బు ఎవరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.