Begin typing your search above and press return to search.

చనిపోవటం ఖాయమని తేలాక.. అంత్యక్రియలకు తానే ఏర్పాట్లు చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   6 April 2023 9:41 AM GMT
చనిపోవటం ఖాయమని తేలాక.. అంత్యక్రియలకు తానే ఏర్పాట్లు చేసుకున్నాడు
X
మరణం ముంచుకొస్తుందన్న విషయం తెలిసినంతనే ఆగమాగమైపోతాం. తల్లడిల్లిపోతాం. అయితే.. వీటన్నింటితో పాటు దేశం కాని దేశంలో ఉన్న ఒక తెలుగోడు.. తాను మరణించిన తర్వాత తన అంత్యక్రియలు తాను పుట్టిన ఊరిలో.. తనను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల చేతుల మీదుగా వెళ్లిపోవాలని ఆశించాడు.అందుకుతగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకున్నాడు. విన్నంతనే అయ్యో అనిపించే ఈ విషాద ఉదంతం గురించి తెలిసినంతనే మనసంతా చేదుగా మారటం ఖాయం. తన మరణానికి ముందే తన అంత్యక్రియలకు ఏర్పాట్లను పక్కాగా చేసుకున్న తెలుగు వ్యక్తి ఉదంతమిది అసలేం జరిగిందంటే.

ఖమ్మం నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి రామారావు. ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాష్టారు ప్రమీల. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్దవాడు హర్షవర్దన్. 33 ఏళ్ల వయసులో అనూహ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆస్ట్రేలియాలో ఉండే అతను. తనకు ఎదురైన అనారోగ్యంతోతల్లిదండ్రులు తల్లడిల్లిపోతుంటే. తానే ఓదార్చేవాడు. అంతేకాదు. దేశం కాని దేశంలో ఉన్న వేళ తాను అనుకోకుండా మరణిస్తే. తన డెడ్ బాడీని తన ఊరికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.

బీఫార్మసీ చేసిన హర్ష ఉన్నత చదువుల కోసం 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. బ్రిస్బేన్ వర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసి.. క్వీన్స్ ల్యాండ్ సిటీలో ప్రైవేటు డాక్టర్ గా పని చేస్తున్నాడు. 2020ఫిబ్రవరిలో అంటే.. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించటానికి కాస్త ముందుగా ఖమ్మం వచ్చి పెళ్లి చేసుకున్నాడు. వీసా వచ్చాక భార్యను ఆస్ట్రేలియాకు తీసుకెళతానని చెప్పి ఫిబ్రవరి 29న వెళ్లిపోయాడు.కరోనా నేపథ్యంలో ఆమె వెళ్లటం సాధ్యం కాలేదు. ఆ ఏడాది అక్టోబరులో వ్యాయామం చేస్తుండగా దగ్గుతో పాటు ఆయాసం రావటంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా. ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకిందన్న షాకింగ్ నిజం బయటకు వచ్చింది.

ఇంటికి రమ్మన్న తల్లిదండ్రులకు మంచి వైద్యం దొరుకుతుందని నచ్చజెప్పి ఆస్ట్రేలియాలో ఉండిపోయాడు. తనకు సోకిన క్యాన్సర్ నయం అయ్యే పరిస్థితి లేదన్న విషయాన్ని గమనించిన అతడు.. తనకు మరణం తప్పదని గుర్తించి. ముందుగా భార్యకు విడాకులు ఇచ్చేసి ఆమె జీవితంలో స్థిరపడేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాడు. 2022 సెప్టెంబరులో ఖమ్మం వచ్చి రెండు వారాలు ఉన్నాడు. ఆ సందర్భంగా క్యాన్సర్ తగ్గుముఖం పట్టినట్లుగా భావించాడు. తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత. క్యాన్సర్ తిరగబెట్టటంతోతనకు మరణం తప్పదన్న విషయాన్ని గుర్తించాడు.

తన చావు గురించి తెలిసిన తర్వాత భయపడకుండా తల్లిదండ్రులకు. బంధువులకు తానే ధైర్యం చెప్పేవాడు. తాను మరణించిన తర్వాత తన డెడ్ బాడీ ఖమ్మం చేరేందుకువీలుగా ఒక లాయర్ ను ఏర్పాటు చేసుకొని. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తనకు తానే చేసుకున్నాడు. షెడ్యూలో ప్రకారం మే 21న హర్ష తన తమ్ముడి పెళ్లి కోసం ఖమ్మం రావాల్సి ఉంది. కానీ మార్చి 24న అతను మరణించాడు. ముందుగా చేసుకున్న ఏర్పాట్లలో భాగంగా.. ఆస్ట్రేలియా నుంచిఆయన డెడ్ బాడీ బుధవారం ఖమ్మంకు చేరుకుంది. తల్లిదండ్రులు అతని భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదంతం గురించి విన్నవారంతా అయ్యోఅనకుండా ఉండలేని పరిస్థితి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.