Begin typing your search above and press return to search.

42వేల జీవోలు సీక్రెట్ గానా? కేసీఆర్ సర్కారు కు హైకోర్టు సూటి ప్రశ్న

By:  Tupaki Desk   |   18 Feb 2020 4:30 AM GMT
42వేల జీవోలు సీక్రెట్ గానా?  కేసీఆర్ సర్కారు కు హైకోర్టు సూటి ప్రశ్న
X
యావత్ తెలంగాణ లో ధూంధాంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నవేళ.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక కేసు విషయం లో కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలను వెబ్ సైట్లో పెట్టకుండా రహస్యం గా ఎందుకు ఉంచుతున్నారు? అంటూ డివిజన్‌ బెంచ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది.

అంతేకాదు.. భారత సిలికాన్ వ్యాలీగా అభివర్ణించే హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ జీవోల్ని వెబ్ సైట్లోకి అప్ లోడ్ చేసే సాఫ్ట్ వేర్ లభించటం లేదా? అన్న ప్రశ్నను సంధించింది. బీజేపీకి చెందిన నేత పేరాల శేఖర్ రావు హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణను షురూ చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్. నిజానికి ఈ వాజ్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గత ఏడాది సెప్టెంబరులోనే తాము ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.

ఇప్పటివరకు ఎందుకని కౌంటర్ దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇదే అంశంపై ఈ నెల 28లోపు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి నుంచి ఇప్పటివరకు (2014 నుంచి 2019 ఆగస్టు 15 వరకు) 1,04,171 జీవోలు జారీ చేసిందని.. వాటిల్లో 42,462 జీవోలను రహస్యంగా ఉంచిందన్నారు.

గతంలో మరే ప్రభుత్వం ఇలా వ్యవహరించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోల్ని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసేందుకు ఒక అధికారి ని బాధ్యుడిగా నియమించాలని పిటిషనర్ కోరారు. ప్రభుత్వ తీరుపై హైకోర్టు డివిజన్ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసిన వేళ.. దీనిపై కేసీఆర్ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.