Begin typing your search above and press return to search.

హైవే కిల్లర్ మున్నా భాయ్ క్రిమినల్ స్టోరీ !

By:  Tupaki Desk   |   25 May 2021 1:30 AM GMT
హైవే కిల్లర్ మున్నా భాయ్ క్రిమినల్ స్టోరీ !
X
మహ్మద్‌ అబ్దుల్‌ సయ్యద్ .. అలియాస్ మున్నా భాయ్. జాతీయ రహాదారులపై మారణహోమం సృష్టించిన మానవ రూపంలోని రాక్షశుడు. 17మంది అమాయక లారీ డ్రైవర్లను , క్లీనర్లను పొట్టన పెట్టుకున్న గజదొంగ. ఈ కిల్లర్ కేసులో ఈ రోజు ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్ట్‌ ఈరోజు తుది తీర్పు వెలువరించింది. మున్నాతో సహా 12 మందికి ఉరి శిక్ష విధించింది. మరో 7 గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

ఈ మున్నా భాయ్ నేర చరిత్ర గురించి పోలీసులు చెప్పిన వివరాల్లోకి వెళ్తే .. పోలీసులమంటూ హైవేలో లారీలు ఆపడం, డ్రైవర్లను హత్య చేసి లారీలు దొంగిలించడం. ఇదే మున్నా గ్యాంగ్ చేసే పని. ఈ మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్‌ మున్నాను 2008లో అరెస్ట్ చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు. తన బంధువుల జంట హత్యతో మొదలైన మున్నా నేర పరంపర, హైవేలో దారి దోపిడీలు చేయడం, పక్క రాష్ట్రలకు గన్స్‌ సప్లై చేయడం వరకూ ఎదిగింది. అయితే , ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట తప్పు చేయకపోతాడా అన్నట్టుగా ఒకసారి తమిళనాడుకు చెందిన ఓ లారీ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో మున్నాను అరెస్ట్‌ చేసి , విచారణలో అతని నేరాల చిట్టా మొత్తం బయటికి లాగారు. హైవేలో జరిగిన లారీ డ్రైవర్ల హత్యలన్నీ మున్నా గ్యాంగ్‌ చేసిందని నిర్ధారించారు. మున్నా నేర చరిత్ర చూసి పోలీసులే విస్తుపోయారు. ఇప్పటికే ఓసారి బెయిల్‌పై వచ్చి తప్పించుకుపోయాడు మున్నా. అదృష్టం కొద్దీ మళ్లీ ఇప్పుడు దొరికాడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు మున్నా తప్పించుకోకుండా కేస్‌ ఫైల్‌ చేశారు. అతని చేతిలో మరణించిన వారి కుటుంబాలు అతనికి ఉరి శిక్షే సరైంది అంటూ ఎన్నో సార్లు కోర్టుకి విన్నపించారు. అదే నిజం అయింది.

గత 13 క్రితం ఏపీలోని పలు హైవేలపై లారీలు మిస్‌ అయ్యాయి. ఓ దారి దోపిడీ ముఠా వీటిని అపహరిస్తోంది. వాటికి సంబందించిన డ్రైవర్ల ఆచూకీ లేకుండా పోతున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంతో పోలీసులు వాటిపై దృష్టి పెట్టారు. ఎంత ప్రయత్నించినా, లారీలకు సంబందించి ఒక్క క్లూ కూడా కనిపెట్టలేకపోయారు. మొత్తం 17 మంది డ్రైవర్లు కనిపించ కుండా పోయారు. అయితే , పోలిసుల ఎంక్వయిరీ లో మున్నాభాయ్ పేరు వెలుగులోకి వచ్చింది. మధ్యలోనే చదువు మానేసి , చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ , దోపిడీలు చేస్తూ అలా ఓ గ్యాంగ్‌ తయారు చేసుకుని దారి దోపిడీలు చేయడం ప్రారంభించారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రైవర్లే ఇతని టార్గెట్. ఆర్టీవో ఆఫీసర్లమంటూ హైవేల్లో లారీలు ఆపేవాళ్లు. లారీ పేపర్స్‌ చూపించాలని డిమాండ్‌ చేసే వాళ్లు. డ్రైవర్లు పేపర్లు వెతికే పనిలో ఉండగా వారిపై దాడి చేసి లారీ స్వాధీనం చేసుకునేవారు. లారీలను ముక్కలు చేసి వాటి పార్ట్స్‌ను సపరేట్‌గా అమ్ముకునే వాళ్లు ఇందుకోసం అండర్‌ గ్రౌండ్‌ షెడ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఒంగోలులో మున్నా యాక్టివిటీస్‌ తగ్గిపోవడంతో అతను మారిపోయాడని భావించారు పోలీసులు. కానీ హైవేలపై దోపిడీలు, హత్యలు చేస్తున్న ముఠా మున్నాదేనని వారికి తెలియదు. ఒక రోజు తమిళనాడుకు చెందిన ఓ డ్రైవర్‌ హైవేపై కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి లారీని లాక్కున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్‌ చెప్పిన ఆధారాల ప్రకారం ఈ దోపిడీలు చేస్తున్నది మున్నా ముఠా అని గుర్తించారు పోలీసులు. దీనితో పోలీసుల చర్యలను పసిగట్టిన మున్నా రాష్ట్రం నుంచి పారిపోయాడు. కర్ణాటక లో ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడికి వెళ్లి ముఠాతో సహా నిందితున్ని అరెస్ట్ చేశారు. అయితే , ఆ తర్వాత బెయిల్‌ పై బయటకు వచ్చి, మహారాష్ట్ర కి పారిపోయాడు. మహారాష్ట్రలో గన్‌ డీలర్స్‌తో లింక్‌ పెట్టుకున్నాడు మున్నా. వేరే రాష్ట్రాల నుంచి గన్స్‌ తెప్పించి అమ్మేవాడు. జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మున్నా చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. కానీ మున్నా మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని మళ్లీ ఒంగోలుకు వచ్చాడు. రియల్టర్‌ కొత్త అవతారమెత్తి మోసాలు చేయడం ప్రారంభించాడు. తనకు హైదరాబాద్‌ లో చాలా భూములు ఉన్నాయంటూ అమాయకులను మోసం చేశాడు. ఓ జాతీయ రహదారిపై వ్యక్తిని హత్య చేసి అతని కారును ఎత్తుకెళ్లింది మున్నా గ్యాంగ్‌. ఈ ఘటనతో మున్నా బతికే ఉన్నాడని పోలీసులకు అర్ధమైంది. అంతే పక్కా ప్లాన్‌ చేసి మున్నాను అరెస్ట్‌ చేశారు. ఈ సారి మున్నా తప్పించుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మున్న పాపాల చిట్టాను కోర్ట్‌ ముందు ఉంచారు. ఇలాంటి నేరస్తుడు బయట తిరగడం ప్రమాదకరమని నిరూపించారు. పోలీసులు బలమైన సాక్ష్యాధారాలను నిరూపించటంతో కోర్టు సోమవారం మున్నాతో సహా అతనిగ్యాంగ్ లోని మరో 11 మందికి ఉరిశిక్ష, నలుగురికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.