Begin typing your search above and press return to search.

రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఆరోగ్యం ఎలా ఉంది?

By:  Tupaki Desk   |   11 Dec 2021 11:16 AM IST
రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఆరోగ్యం ఎలా ఉంది?
X
ఉదయం ఐదారు గంటల మధ్య హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిటైర్డు ఐఏఎస్ అధికారి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సీనియర్ అధికారి ఇంట్లో హైడ్రామా నెలకొనటం తెలిసిందే. ఏపీ సీఐడీకి చెందిన అధికారులు లక్ష్మీనారాయణ ఇంటికి రావటం.. సోదాలు నిర్వహించటం.. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల అభ్యంతరాలు.. లక్ష్మీ నారాయణ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించటం.. లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఏపీ నైపుణ్యాభివ్రద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై.. ఏపీ సీఐడీ అధికారులు లక్ష్మీ నారాయణతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ సంస్థకు ఎండీగా.. సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు ఫాంహౌస్ లోనూ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించటం తెలిసిందే.

సోదాలు సందర్భంగా తీవ్రమైన ఒత్తిడికి గురైన లక్ష్మీ నారాయణ కళ్లు తిరిగి పడిపోయారు. ఆయనకు అప్పటికే గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో.. ఆయన ఇంట్లోని బెడ్రూంకు తీసుకెళ్లి.. అక్కడే ప్రథమ చికిత్స చేశారు.అయినప్పటికి ఆయన ఆరోగ్యం కుదుటుపడకపోగా.. అంతకంతకూ సీరియస్ అవుతున్న వైనంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ఆయన్ను ఇంటికి దగ్గర్లోని స్టార్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది.

శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వేళలో.. ఆసుపత్రికి చెందిన అంబులెన్సు ఇంటికి చేరుకుంది. అందులో ఆయన్ను తరలించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వెంటనే ఆయన్ను ఐసీయూకు తరలించారు.

ఆయన ఆరోగ్యం ఇబ్బందికరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఏపీ సీఐడీ అధికారులు తన ఇంట్లో సోదాలు నిర్వహించటంపై లక్ష్మీనారాయణ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనటంతో పాటు.. తన పరువు తీసేలా అధికారులు వ్యవహరించారన్న ఆవేదన వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.

కళ్లు తిరిగి పడిపోయిన వెంటనే.. ఆయన ఫ్యామిలీ డాక్టర్ దిలీప్ కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న లక్ష్మీనారాయణకు వైద్య పరీక్షలు చేసి.. ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని కోరినా.. సీఐడీ అధికారులు మాత్రం అంగీకరించలేదు. ఇంట్లోనే వైద్యం చేయాలన్నారు. అయితే.. లక్ష్మీనారాయణకు అప్పటికే రెండు శస్త్ర చికిత్సలు జరిగి ఉండటం.. రక్తపోటు పెరిగిన నేపథ్యంలో ఆసుపత్రికి తరలించాల్సిందేనని తేల్చారు. కుటుంబ సభ్యులు సైతం సీఐడీ అధికారుల్ని నిలదీసినట్లుగా చెబుతున్నారు.

అనారోగ్యంతో పడిపోయినా ఆసుపత్రికి వెళ్లనివ్వకుండా ఉండటంలో అర్థం లేదని ప్రశ్నించారు. చివరకు సీఐడీ అధికారులు అంగీకరించటంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్టార్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ఒక మోస్తరుగా ఉన్నట్లు చెబుతున్నారు. న్యూరో.. కార్డిక్ సమస్యల్ని ఎదుర్కొంటున్నారని.. ఆయన ఆరోగ్యం మెరుగుపడటానికి మరికొద్ది రోజులు పడొచ్చన్న అభిప్రాయాన్ని వైద్యులు చెబుతున్నారు.