Begin typing your search above and press return to search.

సీబీఐ.. ఈడీ విచారణ ఎలా సాగుతుంది? టీ మంత్రి ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   11 March 2023 11:24 AM GMT
సీబీఐ.. ఈడీ విచారణ ఎలా సాగుతుంది? టీ మంత్రి ఏం చెప్పారు?
X
కారణం ఏమైనా కానీ ఉన్నత పదవుల్లో ఉన్న వారి మీద ఆరోపణలు రావటం ఒక ఎత్తు. అవి కాస్తా కేసుల రూపంలోకి మారి.. విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల వరకు వెళ్లటం మరో ఎత్తు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి తాజాగా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు తెలంగాణన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత. ఆమె ఈడీ అధికారుల ముందుకు హాజరయ్యే వేళలో.. అసలు ఈడీ.. సీబీఐ విచారణ ఎలా ఉంటుంది?

అధికారుల ముందుకు వెళ్లిన తర్వాత ఏం చేస్తారు? అన్నేసి గంటలు ఏమేం అడుగుతారు? విచారణ వేళ ఈడీకి.. సీబీఐకి.. ఐటీ అధికారుల మధ్య తేదా ఏమిటి? ఎవరి తీరు ఎలా ఉంటుంది? విచారణ వేళ గద్దిస్తారా? కేకలు వేస్తారా? అధికారుల తీరు ఎలా ఉంటుంది? లాంటి సందేహాలు బోలెడన్ని కలగొచ్చు. ఇలాంటి డౌట్ వచ్చిన ఒక మీడియా సంస్థ.. ఇప్పటికే ఇలాంటి విచారణ సంస్థల విచారణను ఎదుర్కొన్న తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ను అడిగి తెలుసుకుంది.

ఈ సందర్భంగా ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలకు చెందిన అధికారుల విచారణ ఎలా ఉంటుందో అరటి పండు వొలిచి నోట్లో పెట్టినంత సులువుగా విషయాన్ని చెప్పేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారన్నది చూస్తే.. విచారణకు అధికారుల ముందు కూర్చున్నంతనే జీవిత చరిత్ర మొత్తం చెప్పమని అడుగుతారు. పుట్టింది ఎక్కడ? పెరిగింది ఎక్కడ? భార్య పిల్లలు ఇలా మొత్తం సమాచారాన్ని అడుగుతారు.

"మొత్తం ప్రొఫైల్ అడుగుతారు. దానికి రెండు గంటల వరకు పడుతుంది. చెప్పిన విషయాల్లో ఏమైనా సందేహం వస్తే ప్రశ్నలు అడుగుతారు. వాటికి సంబంధించిన వివరాల్లో ఏమైనా సందేహాలు ఉంటే వాటి గురించి మళ్లీ అడుగుతారు. అసలైన ప్రశ్నలు వచ్చేది అరగంట మాత్రమే. ఆ అరగంటలో మనం చెప్పే విషయాల్ని వారి దగ్గర ఉన్న ఆధారాలతో క్రాస్ చెక్ చేసుకుంటారు. తప్పు చేసి ఉంటే.. ఆ ఆధారాలకు సంబంధించిన మరిన్ని ప్రశ్నలు అడుగుతారు. లేదంటే.. అక్కడితో ఆ విషయాన్ని వదిలేస్తారు" అని పేర్కొన్నారు.

కొన్ని ప్రశ్నలకు సంబంధించి తికమక పెట్టినట్లుగా అడుగుతారని అది కూ. సీబీఐ వాళ్లు అలా చేయరని.. ఈడీ వారు చేస్తారని చెప్పారు మంత్రి గంగుల. "వాళ్లు అడిగే ప్రతి ప్రశ్నకు సంబంధించిన ఆధారం వాళ్ల దగ్గర ఉంటుంది. మన ఫోన్ లో సమాచారం అంతా క్లౌడ్ లో ఉంటుంది కాబట్టి..ఆ డేటా వారి ముందు పెట్టుకొని అడుగుతారు. ఆ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా మళ్లీ.. మళ్లీ అడుగుతారు. ఎనిమిదేళ్ల క్రితం వాట్సాప్ డేటాను కూడా వారు సేకరించి.. ముందు ఉంచుకుంటారు. మనం పంపిన మొయిల్స్ .. మనం చేసిన వాట్సాప్ కాల్స్ మనం డిలీట్ చేసినా క్లౌడ్ లో ఉంటుంది కాబట్టి ఆ డేటాను తమ వద్ద ఉంచుకుంటారు. మన ముందు డాక్యుమెంట్ ఎవిడెన్సు పెడతారు. నిజాయితీగా ఒప్పుకోవాలి. అంతకు మించి వేరే మార్గం ఉండదు కదా? డాక్యుమెంట్ ఎవిడెన్సు ఉన్నప్పుడు మాత్రం ఎవరూ తప్పించుకోలేరు" అని చెప్పుకొచ్చారు.

మీరు ఫలానా ఇంటికి వెళ్లారా? అని అడిగితే.. వెళ్లామంటే ఎందుకు వెళ్లారని అడుగుతారు. అదే వెళ్లలేదని అంటే.. సీసీ కెమేరా ఫుటేజ్ ను మీ ముందు పెట్టి.. వెళ్లారు కదా? అని అడుగుతారు. అలా ప్రతి ఒక్కదాని విషయంలోనూ వారి దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటుందన్న గంగుల.. "ఎట్టి పరిస్థితుల్లో అక్కడ తప్పు చేసినా.. నేరం చేసినా తప్పించుకునే వీలు ఉండదు" అని స్పష్టం చేశారు. నేరం చేయకుంటే శిక్ష వేసే వీలు ఉండదన్నారు. విచారణకు ముందు.. అరెస్టు చేయటానికి ముందు అన్నిడాక్యుమెంట్లను చెక్ చేసుకొని.. అన్ని పక్కాగా ఉన్న తర్వాతే వారు అడుగు ముందుకు వేస్తారని చెప్పటం గమనార్హం.

సీబీఐ ఎప్పుడూ చేయి చేసుకోవటం ఉండదని.. చివరకు బూతులు తిట్టటం కూడా ఉండదన్నారు. ఎవిడెన్సు పెట్టుకొని మాత్రమే సీబీఐ మాట్లాడుతుందన్నారు గంగుల. ఈడీ మాత్రం డేటా ప్రకారం ప్రశ్నలు వేస్తారని.. వారి దగ్గర బ్యాంకు ఖాతాల నుంచి అన్ని వివరాల్ని తమ వద్ద ఉంచుకొని మాట్లాడతారన్నారు.సీబీఐతో పోలిస్తే ఈడీ వాళ్లు కాస్తంత కన్ఫ్యూ్జ్ చేసేలా మాట్లాడతారు. ఈడీ కాస్తంత గట్టిగా మాట్లాడుతుందేమో కానీ సీబీఐ వాళ్లు అస్సలు మాట్లాడరు. ఐటీ విభాగం వాళ్లు మాత్రం కాస్తంత గట్టిగా మాట్లాడతారు. నిజంగానే తప్పు చేసినట్లు తేలుతుంటే మాత్రం వాళ్ల గొంతు పెరుగుతుంటుంది. నిర్దోషిగా అన్నప్పుడు మాత్రం డామినేట్ చేసే మాటలు వారి నోటి నుంచి రావన్నారు. "మీరు నిర్దోషి అయితే మాత్రం అందరు గౌరవిస్తారు. మీరు దోషి అయితే మాత్రం ప్రతి ఒక్కరు భయపెట్టిస్తుంటారు" అంటూ తనకున్న అనుభవాన్ని వివరంగా వెల్లడించారు మంత్రి గంగుల కమలాకర్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.