Begin typing your search above and press return to search.

టీడీపీ గెలిస్తే క్రెడిట్ ఆయనదేనా...?

By:  Tupaki Desk   |   17 March 2023 1:30 PM IST
టీడీపీ గెలిస్తే క్రెడిట్ ఆయనదేనా...?
X
ఉత్తరాంధ్రాలో గత నాలుగేళ్ళుగా తెలుగుదేశం జోరు అయితే లేదు. 2019 నుంచి ఆ పార్టీ జాతకం మారడంలేదు. కంచుకోటలైన జిల్లాలలో పరాజయం బాట పట్టి చిక్కి శల్యం అయిపోయింది. ఈ నేపధ్యంలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా వైసీపీ హవా నడచింది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది టైం ఉందనగా వచ్చిన పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం నేతలు అంతా కలసికట్టుగా పనిచేశారు.

అన్నింటికీ మించి వారిలో కసి అయితే గట్టిగా కనిపించింది. ముఖ్యంగా మళ్లీ రీ యాక్టివ్ అవుతాను అని చెప్పిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే కాలికి బలపం కట్టుకునే తిరిగారు. ఆయన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి వేపాడ చిరంజీవిరావు విజయం కోసం శ్రమించారు. వ్యూహాలు రూపొందించారు. ఎత్తులు వేశారు.

ఒక విధంగా చూస్తే గంటా తెలుగుదేశం పార్టీలో తన పూర్వ ప్రాభవాన్ని సంపాదించుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక దారిగా చూసుకున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన కష్టం చాణక్యం కూడా ఈ ఎన్నికల్లో ఉందని అంతా అంటున్నారు. అంగబలం, అర్ధబలం దండీగా ఉన్న గంటా బరిలోకి దిగడంతో తెలుగుదేశంలో ఊపు కూడా వచ్చింది.

ఇక మరోవైపు తెలుగుదేశానికి సామాజికవర్గం నేపధ్యం కూడా కలసివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపు క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వడం, దానికి మించి కోచింగ్ సెంటర్ ని నిర్వహించే విద్యావేత్తకు సీటు కట్టబెట్టడంతో విజయానికి మార్గాలు ఏర్పడ్డాయని విశ్లేషిస్తున్నారు. అన్నింటికీ మించి చూస్తే నిరుద్యోగ యువత, టీచర్స్ ఈ ఎన్నికల్లో అధికార పార్టీ పట్ల విముఖంగా ఉండడం కూడా టీడీపీకి కలసి వచ్చే అవకాశం కనిపించింది.

అదే విధంగా ఎన్నికలు దగ్గరలో ఉండడంతో నాయకులు అంతా మళ్లీ రీ చార్జి అయ్యారు. అదే టైం లో వైసీపీలో చూస్తే అధికారం చేతిలో ఉండడంతో అంతా ఆర్భాటంగా సాగింది. ఈ కొట్టొచ్చినట్లుగా ఉన్న తేడా ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించనుంది అంటున్నారు. హై కోర్టు తీర్పు నేపధ్యంలో ఫలితం ప్రకటించకూడదు అని ఆదేశాలు ఉన్నాయి.

అయితే 16న రాత్రి ఏడు గంటలకు మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో చూసుకుంటే అనధికార సమాచారం బట్టి టీడీపీ లీడింగ్  లో   ఉన్నట్లుగా చెబుతున్నారు. తొలి రెండు రౌండ్లలోనే టీడీపీ కి   ఆధిక్యత లభించడమే కాకుండా వైసీపీని రెండవ స్థానంలోకి నెట్టడం జరిగింది అని అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మరో రోజు గడిస్తే కానీ  కానీ అసలు ఫలితం తేలదు అంటున్నారు. అయితే నాలుగేళ్లుగా గెలుపు పిలుపు కోసం వగచి వాపోతున్న టీడీపీకి ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఫలితం ఊపిరి పోయవచ్చు అన్న గట్టి నమ్మకం అయితే తమ్ముళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అదే టైం లో గంటా లాంటి సీనియర్ నేతలు ఈ ఫలితాన్ని ఆసరాగా చేఅసుకుని మరోమారు తెలుగుదేశంలో తమ సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.