Begin typing your search above and press return to search.

I-MAX ఆప‌రేట‌ర్ జీవితంలో క‌రోనా క‌ల్లోలం

By:  Tupaki Desk   |   15 Sep 2020 4:15 AM GMT
I-MAX ఆప‌రేట‌ర్ జీవితంలో క‌రోనా క‌ల్లోలం
X
మ‌హ‌మ్మారీ క‌రోనా వైర‌స్ మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాల్ని ప్ర‌మాదంలోకి నెట్టేసింది. చాలీ చాల‌ని జీతాల‌తో బ‌తుకు బండి న‌డిపించే కుటుంబాల్లో నిప్పులు పోస్తోంది. ఇఎంఐల‌కు.. పిల్ల‌ల‌ స్కూల్ ఫీజుల‌కి స‌రెండ‌ర్ అయిపోయే జీవితాల్లో క‌రోనా ఒక్క‌సారిగా బ‌డ‌భాగ్నిని ర‌గిలించేసింది. దీని కార‌ణంగా మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాల్లో అత్యంత దుర్భ‌ర‌మైన ప‌రిస్థితులు మొ‌ద‌ల‌య్యాయి.

దీన్ని త‌ట్టుకుని కొంత మంది బ్ర‌తుకీడుస్తుంటే కొంత మంది మాత్రం ఊహించ‌ని ఈ విపత్తున‌కు త‌నువు చాలిస్తున్నారు. బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పూనుకుంటున్నారు. చేస్తున్న సంస్థ‌ల్లో క‌రోనా కార‌ణంగా ఒక్క‌సారి గా జీతం స‌గానికి ప‌డిపోయింది. క‌రోనాతో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగితే చేతిలో చిల్లిగ‌వ్వ‌లు త‌గ్గిపోయిన ప‌రిస్థితి దాపురించింది. ఇది అత్యయిక ప‌రిస్థితిగా ప్ర‌జ‌లు చూడాల్సి ఉంది. ఇక చాలామంది పేద‌లు బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు దీన్ని అధిగ‌మించ‌లేక‌.. ఉన్న‌దాంతో స‌ర్దుకోలేక చాలా మంది న‌ర‌కం అనుభ‌విస్తున్నారు. ఉన్న‌ట్టుండి ఆదాయం ప‌డిపోవ‌‌డం అన్న‌ది ఇత‌ర రంగాల్లానే సినీరంగంపైనా.. థియేటర్ల రంగంపైనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. గ‌త 6 నెల‌లుగా థియేట‌ర్లు తెరుచుకోక‌పోవ‌డంతో అస‌లు జీతం చేతికి అంద‌క ఐ మ్యాక్స్ థియేట‌ర్ ఆప‌రేట‌ర్ భాస్క‌ర్ (52) సూసైడ్ చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది.

బ‌తుకు భార‌మ‌వుతున్నా త‌న‌కు ఎలాంటి జీతం అంద‌క‌పోవ‌డంతో మ‌న‌స్థాపానికి గురైన భాస్క‌ర్ మ‌రో అవ‌కాశం లేక‌పోవ‌డంతో కుటుంబ భారం మోయ‌లేక ఆత్మ హ‌త్య చేసుకున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా థియేట‌ర్లు తెరుచుకోక‌పోవ‌డంతో ఐమ్యాక్స్ సిబ్బందికి జీతాలు ఇవ్వ‌డం లేదన్న ప్ర‌చారం సాగుతోంది. భాస్క‌ర్ ‌కు హాఫ్ సాల‌రీ క‌ట్టిస్తున్నారు. తాజాగా అది కూడా ఇవ్వ‌లేమంటూ ప్ర‌సాద్ ఐమాక్స్ యాజ‌మాన్యం చేతుల ఎత్తేయ‌డంతో 52 ఏళ్ల భాస్క‌ర్ ఆత్మ హ‌త్య‌కు పూనుకోవ‌డం సంచ‌ల‌నంగా మారిందన్న క‌థ‌నాలు కంట‌త‌డి పెట్టించేవిగా ఉన్నాయి. థియేట‌ర్ల రంగంపై మ‌హ‌మ్మారీ ప్ర‌భావం ఎలా ఉందో బ‌య‌టికి తెలిసింది చాలా త‌క్కువ‌. ఈ ఘ‌ట‌న ఒక ఎగ్జాంపుల్ మాత్ర‌మే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.