Begin typing your search above and press return to search.

జేసీ పవన్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారా...?

By:  Tupaki Desk   |   11 April 2023 2:51 PM GMT
జేసీ పవన్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారా...?
X
ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే జేసీ బ్రదర్స్ గుర్తుకు వస్తారు. వారిది నాలుగున్నర దశాబ్దాల పైబడిన రాజకీయం. జేసీ దివాకరరెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి కీలక పదవులు నిర్వహించారు. ఇపుడు వారి వారసులు రాజకీయాల్లో అడుగుపెట్టారు. జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి గత ఎన్నికల్లో అనంతపురం లోక్ సభ నుంచి పోటీ చేస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి బరిలోకి దిగారు

తొలి ప్రయత్నంలోనే ఇద్దరూ ఓటమి చెందారు. ఆ తరువాత చూస్తే జేసీ పవన్ రెడ్డి అడపా తడపా టీడీపీ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. అయితే ఆయనకు అనంతపురం అసెంబ్లీ నుంచి 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందిట. ఆ కోరికను ఆయన మనసులో దాచుకోలేదు కూడా. తన ఆశను చంద్రబాబు, లోకేష్ ల వద్ద పవన్ రెడ్డి బయటపెట్టారు.

అయితే ఆ కోరికను వారు పూర్తిగా తిరస్కరించినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే అనంతపురం అసెంబ్లీ సీటులో టీడీపీకి పవర్ ఫుల్ లీడర్ గా ప్రభాకర చౌదరి ఉన్నారు. అది ఆయన అడ్డా. దాంతో ఆయన్ని పక్కన పెట్టి పవన్ రెడ్డికి టికెట్ ఇవ్వడం అన్నది వల్లకాదు. ఈ విషయంలోనే పవన్ రెడ్డి పూర్తి నిరుత్సాహానికి గురి అయ్యారని అంటున్నారు.

ప్రస్తుతం అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. దాంట్లో ఎక్కడా జేసీ పవన్ రెడ్డి కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది అంటున్నారు. ఆయన గత కొంతకాలంగా టీడీపీలో తన యాక్టివిటీని తగ్గించేసుకున్నారని అంటున్నారు. తనకు అనంతపురం అసెంబ్లీ టికెట్ ఇస్తేనే రాజకీయం అన్నట్లుగా పవన్ అంటుననరని చెబుతున్నారు.

మరో వైపు పవన్ తరఫున ఆయన తండ్రి సీనియర్ నేత జేసీ దివాకరరెడ్డి తమ జిల్లాకు వచ్చిన లోకేష్ ని కలసి వచ్చారు. ఆయన తనయుడి సీటు విషయమే ప్రస్తావించి ఉంటారని అంటున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ తాడిపత్రిలో లోకేష్ పాదయాత్ర ఉన్నా కూడా ఇపుడు జేసీ దివాకరరెడ్డి కూడా కనిపించలేదు. లోకేష్ కి జేసీ ప్రభాకరరెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి స్వాగతం పలికారు. వారే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా కట్టించారు

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జేసీ పవన్ రెడ్డి అల్టిమేటమే జారీ చేశారని అంటున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోతే కనుక కచ్చితంగా పార్టీకి దూరం అవుతాను అన్నదే జేసీ పవన్ రెడ్డి గైర్ హాజరు వెనక ఉన్న మాట అని అంటున్నారు. ఇక అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. అర్ధబలం అంగబలం ఉన్న కుటుంబాలు అవి. వారితో పెట్టుకుంటే ఇబ్బందే. అలాగని వారు కోరుకునే సీటు ఇవ్వాలన్నా అక్కడ ప్రభాకర చౌదరి ఏమీ తక్కువ కాదు.

ఆయన నా ఏరియాకు వస్తే చూస్తూ ఊరుకోను, అది ఎవరైనా అని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశారు. నిజానికి జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ లో ఉన్నపుడు టీడీపీ నుంచి ఎదుర్కొన్నది ప్రభాకర చౌదరి పరిటాల ఫ్యామిలీ వారే. ఇపుడు టీడీపీలోకి జేసీలు రావడంతో అంతా కలగాపులగం అవుతుందని అంటున్నారు. ఈ వర్గ పోరు పార్టీకి మంచిది కాదనే అంటున్నారు. ఏది ఏమైనా పవన్ రెడ్డి మాత్రం లోకేష్ వైపు ముఖం చూపించకుండా ఉండడం మాత్రం అనంత టీడీపీలో ముసలానికి నాంది అనే అంటున్నారుట.