Begin typing your search above and press return to search.

ఆ నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్సీపీకి పెద్ద టెన్ష‌నే సృష్టిస్తోందా?

By:  Tupaki Desk   |   27 Aug 2022 6:47 AM GMT
ఆ నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్సీపీకి పెద్ద టెన్ష‌నే సృష్టిస్తోందా?
X
కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీకి పెద్ద టెన్ష‌నే సృష్టిస్తోంద‌ని అంటున్నారు. తాజాగా పార్టీలోని రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌తో సాక్షాత్తూ ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల వైఎస్సార్సీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా రంగ‌ప్ర‌వేశం చేయాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. కొంత‌కాలంగా రెండు వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంద‌ని.. ఈ నేప‌థ్యంలో తాజాగా కాకినాడ‌లోని ఆర్ అండ్ బీ అతిథి గృహం త‌న్నులాట‌కు దిగార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ప్ర‌స్తుతం పెద్దాపురం ఎమ్మెల్యేగా టీడీపీ అభ్య‌ర్థిగా నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న వైఎస్సార్సీపీ అభ్య‌ర్థి తోట వాణిపై గెలుపొందారు. కాగా ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ద‌వులూరి దొర‌బాబు ఉన్నారు. ఆయ‌న నాయ‌క‌త్వాన్ని గ‌త కొన్నేళ్లుగా మ‌రో వ‌ర్గం వ్య‌తిరేకిస్తోంద‌ని అంటున్నారు. త‌ర‌చూ రెండు వ‌ర్గాలు గొడ‌వ‌కు దిగడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ రీజ‌నల్ కోఆర్డినేట‌ర్, ఎంపీ మిథున్‌రెడ్డి రంగంలోకి దిగారు.

తాజాగా కాకినాడ‌లో మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీలు... పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, వంగా గీత, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు.. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబుల సమక్షంలో పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ దవులూరి దొరబాబు, అతని వర్గీయులు, వ్యతిరేక వర్గీయులతో మిథున్ రెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశం జరుగుతుండగానే ఇరు వ‌ర్గాలు బ‌య‌ట‌ ఘర్షణకు దిగి పరస్పరం దూషించుకున్నార‌ని స‌మాచారం.

2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన తోట వాణి, ఆమె భర్త, మాజీ ఎంపీ తోట నరసింహంతో ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీ నేపథ్యంలో తోట నరసింహం జిల్లా రాజకీయాల్లో మరోమారు క్రియాశీకలంగా మారబోతున్నారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మ‌రోవైపు ఎంపీలు వంగా గీత, సుభాష్‌చంద్రబోస్‌.. ద‌వులూరి దొరబాబు వ్యతిరేక వర్గీయుల ఇళ్లకు వెళ్లి చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కాగా పెద్దాపురంలో జ‌న‌సేన పార్టీకి కూడా చెప్పుకోద‌గ్గ బ‌లం ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసిన తుమ్మ‌ల రామస్వామి 25 వేలకు పైగా ఓట్లు సాధించారు. 2009 ఎన్నికల్లో ప్ర‌జారాజ్యం పార్టీ పెద్దాపురం అసెంబ్లీ స్థానంలో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో నేత‌ల మ‌ధ్య విభేదాల‌తోనే 2014, 2019 ఎన్నిక‌ల్లో పెద్దాపురంలో ఓడిపోయామ‌నే భావ‌న‌లో వైఎస్సార్సీపీ ఉంది. మ‌రోమారు ఇలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగింది. ఈ క్ర‌మంలోనే రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రంగంలోకి దిగార‌ని చెబుతున్నారు.